పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్.. ‘ఇంకోసారి టెర్రర్ ఎటాక్ జరిగిందో..’

కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి.

Modi

పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో ఏదైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే భారత్‌పై యుద్ధ చర్యకు పాల్పడ్డట్టే పరిగణించాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి.

భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. ఇకపై దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తారు. అందుకు తగ్గట్టుగానే భారత్ ప్రతిస్పందన ఉంటుంది.

ఇవాళ ఏం జరిగింది?
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్), త్రివిధదళాధిపతులు పాల్గొన్నారు.

భారత్‌లోని 26 ప్రాంతాలపై పాకిస్థాన్‌ దాడికి యత్నించిన నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా శనివారం తెల్లవారుజామున పాక్‌లోని నాలుగు వైమానిక స్థావరాలపై ఇండియా దాడులు చేసింది. అంతేగాక, రఫీకి, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్‌లోని పాకిస్థాన్ సైనిక టార్గెట్‌పై, అలాగే పస్రూర్, సియాల్‌కోట్‌లోని వైమానిక స్థావరాల వద్ద రాడార్ సైట్‌లపై భారత యుద్ధ విమానాలతో అత్యంత కచ్చితత్వంతో దాడులు జరిగాయని భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు.

ఇవాళ ఉదయం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశం నిర్వహించి.. భారత్‌-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై వివరించారు.

పాకిస్థాన్ భారతదేశంపై తీసుకుంటున్న చర్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని విక్రమ్ మిస్రి అన్నారు. పాకిస్థాన్ ప్రచారం చేస్తున్న అసత్య వార్తల గురించి కూడా ఆయన చెప్పారు. పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న తీరును ఆధారాలతో పాటు చూపించారు.