తూర్పు లడఖ్ సరిహద్దులో చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మంగళవారం లఢక్ లో పర్యటించారు. తూర్పు లడఖ్ లో రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో లేహ్ వెళ్లారు ఆర్మీ చీఫ్. విమానం ఎక్కే ముందు జనరల్ నరవాణేకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.
మధ్యాహ్నం లేహ్ చేరుకున్న ఆర్మీ చీఫ్..మిలిటరీ హాస్పిటల్ ను సందర్శించారు. ఇటీవల గల్వాన్ వ్యాలీలో చైనాతో జరిగిన ఘర్షణలో గాయపడి ట్రీట్మెంట్ పొందుతున్న జవాన్లను ఆర్మీ చీఫ్ పరామర్శించారు. లేహ్ సైనిక కేంద్రానికి చేరుకున్న తర్వాత 14 కార్స్ అధికారులతో ఆయన సమీక్ష జరుపుతారు. చైనా అధికారులతో జరుగుతున్న చర్చల పురోగతిని ఆర్మీ చీఫ్ అడిగి తెలుసుకుంటారు.
లఢక్ సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ బదయూరియా ఇటీవల లేహ్‌తోపాటు శ్రీనగర్ వైమానిక కేంద్రాలను రెండు రోజులపాటు రహస్యంగా సందర్శించారు. జూన్ 15-16 తేదీల్లో లఢక్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతోసహా 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు లఢక్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ప్రస్తుతం లడఖ్ లో పరిస్థితులు ఎప్పటి కప్పుడు మారిపోతున్నాయి. ఓ వైపు చర్చలు జరుగుతున్నా.. సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు జరుగుతున్నట్లు సమాచారం. ఈ బలగాల మోహరింపుతో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం. గాల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14 , పాంగాంగ్ టీఎస్‌వో వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు.