Arvind Kejriwal finally enjoys dinner with Gujarat auto rickshaw driver
Gujarat Elections: హైడ్రామా నడుమ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన.. సోమవారం ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే భద్రతా కారణాలను చూపిస్తూ కేజ్రీవాల్‌ను గుజరాత్ పోలీసులు అడ్డుకున్నారు. వారిని చేధించుకుని సోమవారం రాత్రి 7:30 గంటలకు ఆటో డ్రైవర్ ఇంటికి చేరుకున్నారు కేజ్రీవాల్.
కేజ్రీవాల్‌తో పాటు గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, పార్టీ జాతీయ జాయింట్ జనరల్ సెక్రెటరీ ఇసుదన్ గధ్వి సహా పలువురు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేజ్రీవాల్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఆటో డ్రైవర్ పేరు విక్రమ్ దంతాని. అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా ప్రాంత నివాసి. ఒక సందర్భంలో విక్రమ్ స్పందిస్తూ ‘‘నేను మీకు పెద్ద అభిమానిని. పంజాబ్‌లో ఒక ఆటో డ్రైవర్ ఇంటికి మీరు భోజనానికి వెళ్లారని సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియోలో చూశాను. మీరు గుజరాత్ వస్తున్నారని విన్నాను. దయచేసి మా ఇంటికి భోజనానికి వస్తారా?’’ అని కోరాడు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ సోమవారం రాత్రి తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భోజానానికి హాజరయ్యారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్ దూసుకెళ్తోంది. కొద్ది రోజుల క్రితం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన ఆప్.. గుజరాత్లో సైతం పట్టు సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా, ఆప్ కార్యాలయాల్లో గుజరాత్ పోలీసులు సోదాలు చేసినట్లు ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అయితే ఆప్ ప్రకటనను పోలీసులు ఖండించారు. తాము ఎటువంటి సోదాలూ జరపలేదని అన్నారు.