విద్వేష వ్యాఖ్యలు…..ఓవైసీ పార్టీ నాయకుడిపై కేసు నమోదు

సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గిలో జరిగిన సమావేశంలో 15కోట్ల మంది ముస్లింలు మాత్రమే ఉన్నారని.. కానీ వంద కోట్లు ఉన్న హిందువులకు తగిన సమాధానం చెప్పగలరని  ముంబైకి చెందిన మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.

దీంతో వారిస్ పఠాన్ పై కేసు నమోదు చేసినట్లు ఆదివారం(ఫిబ్రవరి-23,2020)కర్ణాటక పోలీసులు తెలిపారు. హిందూ కమ్యూనిటీకి వ్యతిరేకంగా వారిస్ పఠాన్ విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక లాయర్ శ్వేతా ఓంప్రకాష్ రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఫిబ్రవరి-29,2020న తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ వారిస్ కు సమసన్లు జారీ చేసినట్లు కలబుర్గి పోలీస్ కమిషనర్ ఎమ్ఎన్ నాగరాజ్ తెలిపారు. ఫిబ్రవరి-15న సీఏఏ వ్యతిరేక ర్యాలీకి,పబ్లిక్ మీటింగ్ కు నిర్వాహకులు అనుమతి తీసుకున్నప్పటికీ… కంప్లెయింట్,వీడియో ఫుటేజీ ద్వారా…15 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల హిందువులకు సమాధానం చెప్పగలరని హిందీలో వారిస్ అన్నట్లు గుర్తించినట్లు నాగరాజ్ తెలిపారు.

అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన వ్యాఖ్యల పట్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నట్లు వారిస్ పఠాన్ తెలిపారు. భారతీయుడిగా ఉన్నందుకు తాను గర్వపడుతుంటానని, దేశం యొక్క బహుళత్వాన్ని తాను గౌరవించేవాడినని వారిస్ తెలిపారు. ఏ ఒక్క కమ్యూనిటీ సెంటిమెంట్లను హర్ట్ చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదనీ తనకు సమన్లు జారీ చేయడంపై వారిస్ పఠాన్ ఈ విధంగా స్పందించారు. తనను,తన పార్టీని అపఖ్యతి పాలు చేసేందుకు తన వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ మీడియాపై ఫైర్ అయ్యారు వారిస్ పఠాన్.

పబ్లిక్ లో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దంటూ వారిస్ కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ సూచించారు. ఇలాంటి స్టేట్ మెంట్లు తాము ఆమోదించమని మహారాష్ట్ర ఏఐఎంఐఎం ప్రెసిడెంట్,ఓరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. పఠాన్ ను తన వ్యాఖ్యల పట్ల వివరణ కోరుతామని ఇంతియాజ్ తెలిపారు.