Niger Desert Tragedy: సహారా ఎడారిలో మృత్యుఘోష.. దాహంతో 49 మంది మృతి.. గుండెలను పిండేసే నైగర్ ఎడారి విషాద కథ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నైగర్(Niger Desert Tragedy) ఎడారి విషాద సంఘటన.
- V Santhosh Kumar
- Published on- June 6, 2026 / 04:39 PM IST
at least 49 people die of thirst in Niger dessert after truck break down
- దాహంతో 49 మంది ప్రయాణికులు మృతి
- నడి ఎడారిలో విరిగిపోయిన ట్రక్కు
- పండుగ పూట తీరని ఘోర విషాదం
Niger Desert Tragedy: కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలనే ఆరాటం, ఎన్నాళ్లకో కలుసుకోబోతున్నామనే ఆనందం.. కానీ, విధి ఆ కాసేపటి సంతోషాన్ని కూడా ఓర్వలేకపోయింది. ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ వేడుకల కోసం మాలీ దేశం నుండి నైగర్‌లోని తమ స్వగ్రామాలకు ట్రక్కులో బయలుదేరిన ఆ ప్రయాణికులను మృత్యువు సహారా ఎడారి రూపంలో వెంటాడింది. ఎండ తీవ్రతకు అల్లాడిపోతూ, తాగడానికి చుక్క నీరు కూడా దొరకని స్థితిలో, కళ్లముందే ప్రాణాలు విడిచిన ఆ 49 మంది అమాయకుల గాధ వింటే ఎవరి గుండెలైనా పగిలిపోవాల్సిందే.
నడి ఎడారిలో విరిగిపోయిన ట్రక్కు.. ప్రాణాలు తీసిన దాహం!
నైగర్ సరిహద్దు(Niger Desert Tragedy)కు సమీపంలోని అస్సామక ప్రాంతానికి పశ్చిమంగా ప్రయాణిస్తున్న సమయంలో వారి ట్రక్కు అకస్మాత్తుగా చెడిపోయింది. చుట్టూ కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు తప్ప మనుషుల జాడ లేని నిర్జన ప్రదేశం అది. కనీసం మొబైల్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో వారు ఎవరికీ సమాచారం అందించలేకపోయారు. డ్రైవర్, ప్రయాణికులు కలిసి వాహనాన్ని బాగు చేయడానికి రోజుల తరబడి శతవిధాలా ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. కాలం గడుస్తున్న కొద్దీ వెంట తెచ్చుకున్న నీరు అయిపోయింది. సహారా ఎడారిలోని అత్యంత భయంకరమైన ఉష్ణోగ్రతల మధ్య, నిలువునా నకనకలాడుతూ నీటి కోసం వారు చేసిన ఆర్తనాదాలు ఆ ఎడారి ఇసుకలోనే కలిసిపోయాయి.
ఇద్దరు ప్రాణాలతో పోరాడి.. మిగిలిన వారు మాస్ గ్రేవ్స్‌లోకి..:
రోజుల తరబడి నరకయాతన అనుభవించిన తర్వాత, ఇద్దరు ప్రయాణికులు ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలనే పట్టుదలతో సుమారు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన ఎడారిలో ప్రయాణించారు. ఎట్టకేలకు ఒక నీటి వనరును కనుగొని, అస్సామక పట్టణానికి చేరుకుని అధికారులకు ఈ ఘోర విషాదాన్ని వివరించారు. వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకునే సరికి ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. ట్రక్కు కింద, దాని చుట్టుపక్కల 49 మంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సుదూర ప్రాంతం కావడం, మృతదేహాలు కుళ్ళిపోయే స్థితికి చేరడంతో అధికారులకు వేరే దారి లేక, గుండె నిబ్బరం చేసుకుని వారందరినీ అక్కడికక్కడే ఒకే భారీ సామూహిక సమాధిలో (Mass Grave) అంత్యక్రియలు నిర్వహించారు. పండుగ పూట ఇళ్లకు చేరాల్సిన ప్రాణాలు ఇలా ఎడారిలోనే కలిసిపోవడం అంతర్జాతీయంగా తీవ్ర శోకాన్ని మిగిల్చింది.
