Pawan Kalyan : ‘ఉచిత పథకం’ రాజకీయాలకు యువత ఎందుకు దూరమవుతోంది? పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
Pawan Kalyan : ఉచిత పథకాల పేరుతో చేసే రాజకీయాలపై యువత ఆగ్రహంగా ఉందని, ఈ తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తోందని పవన్ కల్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
Pawan Kalyan On Gen Z
- ఉచితాలు కాదు.. యువత కోరేది అవకాశాలా?
- ఉచిత పథకాలిచ్చే రాజకీయాల పట్ల యువత అసంతృప్తి..
- యువతను ఆకట్టుకోవాలంటే ఉచితాలు సరిపోవు..
- దేశీయ రాజకీయాలపై యువత ఎందుకు ఆగ్రహంగా ఉంది?
- పథకాలు ఇచ్చి ఓట్లు అడిగే విధానాన్ని యువత గట్టిగా ప్రశ్నిస్తోంది
- దేశ రాజకీయ భవిష్యత్తును యువత పునర్నిర్మించబోతోంది
Pawan Kalyan : దేశ రాజకీయాలపై యువత ధోరణి ఎలా మారుతుందో క్లియర్ కట్‌గా వివరించారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. యువత దేశ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించబోతున్నారని తాను ఎందుకు నమ్ముతున్నారో కూడా వివరించారు.
ఉచితాల పట్ల యువత ఆగ్రహం :
నేటి యువత, ముఖ్యంగా జెన్ జెడ్ జనరేషన్ గురించి ఆయన తన అద్భుతమైన ఆలోచనలను పంచుకున్నారు. “నేటి యువతను చూస్తే చాలా మార్పు కనిపిస్తోంది. వారు ఉచిత పథకాల రాజకీయాల పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అలాగే, వాటిపై ఎక్కువగా సంతృప్తి చెందడం లేదు. కేవలం పథకాలు ఇచ్చి ఓట్లు అడిగే విధానాన్ని యువత గట్టిగా ప్రశ్నిస్తున్నారు” అని పవన్ తెలిపారు.
నేటి యువత కోరుకునేది ఇదే :
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలపై యువత ఆలోచనా ధోరణి పూర్తిగా మారుతోందని వివరించారు. “ఈ తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. దేశంలో వారికి స్థిరత్వం కావాలి. మంచి అవకాశాలు కావాలి. సమాజంలో సామరస్యం పెంపొందించాలి. దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా దేశం వెళ్లాలని నేటి యువత కోరుకుంటున్నారు” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Read Also : Pawan Kalyan- Modi : మోదీ 12 ఏళ్ల పాలన అద్భుతం.. కష్టసుఖాల్లో ఆయనకు అండగా ఉంటాను : పవన్ కళ్యాణ్
సాంప్రదాయ రాజకీయాలకు అతీతంగా యువత ముందుకు నడుస్తోందని, స్థిరత్వం, అవకాశాలు, సామాజిక సామరస్యం, దీర్ఘకాలిక అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టిసారిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. చరిత్రలో జరిగిన అద్భుతమైన ఘట్టాలను కూడా పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి తరం కూడా అప్పటి రాజకీయ మార్పులో కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
భవిష్యత్తు రాజకీయాలను రూపుదిద్దే శక్తి :
“స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఒక తరం తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన తరం సైద్ధాంతిక, సామ్యవాద ఉద్యమాల ద్వారా దేశీయ సాంప్రదాయ రాజకీయాలను ప్రభావితం చేసింది. ఇప్పుడు అలాగే నేటి యువత కూడా తమ ఆలోచనలతో కొత్త దిశను తీసుకురాబోతోంది” అని పవన్ అభిప్రాయపడ్డారు.
చివరగా పవన్ మాటల్లో యూత్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ తరం కేవలం ప్రేక్షకులుగా ఉండదన్నారు. భవిష్యత్తు రాజకీయాలను రూపుదిద్దే శక్తిగా మారుతుందని జనసేనాని వ్యాఖ్యానించారు.
