Pawan Kalyan- Modi : మోదీ 12 ఏళ్ల పాలన అద్భుతం.. కష్టసుఖాల్లో ఆయనకు అండగా ఉంటాను : పవన్ కళ్యాణ్
Pawan Kalyan- Modi : పీఎం నరేంద్ర మోదీ పదేళ్ల పాలన అద్భుత విజయంగా అభివర్ణించారు జనసేనాని పవన్ కల్యాణ్. కష్టా సుఖాల్లో మోదీకి తాను అండగా నిలుస్తానని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
Pawan Kalyan- Modi
Pawan Kalyan- Modi : ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన అద్భుతమైన విజయంగా అభివర్ణించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ పట్ల తనకు ఉండే గౌరవం, వ్యక్తిగత అభిమానం, సంపూర్ణ మద్దతు గురించి అనేక విషయాలను పంచుకున్నారు.
అంతేకాదు.. తన రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన సంఘటనలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు పవన్. అలాగే, మోదీతో ఏర్పడిన అనుబంధాన్ని కూడా ప్రస్తావిస్తూ.. ఎలా మొదలైంది? ఎలా విశ్వాసంగా మారిందో చెప్పుకొచ్చారు జనసేనాని.
మోదీ మనకు కావాలి :
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న రోజుల్లో ఆయన చేసిన పనులు, రాజకీయ సంకల్పం, ప్రత్యేక ప్రసంగాలు తనపై చెరగని ముద్ర వేశాయన్నారు. ముఖ్యంగా భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో మోదీ ప్రసంగం తననెంతో ప్రత్యేకంగా ఆకట్టుకుందని పవన్ చెప్పారు.
అలాగే, స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో కూడా మోదీ ప్రసంగం దేశాన్ని నడిపించేందుకు అవసరమైన లక్షణాలు ఉన్న నాయకుడని ఆ క్షణంలోనే తనకు అనిపించిందన్నారు. “ఈయనే మన దేశ భవిష్యత్తు, ఆయన మనకు కావాలి. ఎందుకంటే.. మోదీ తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు.” అని పవన్ చెప్పుకొచ్చారు.
కష్టసుఖాల్లో మోదీకి అండగా ఉంటా :
జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ ప్రధాని మోదీని కలవాలని భావించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని అధికారికంగా ప్రకటించకముందే ఆ సమావేశం జరిగిందన్నారు. అప్పుడు ఆ సమావేశంలో పవన్ స్పష్టంగా మోదీకి తన పట్ల విశ్వాసాన్ని తెలియజేశారు.
దేశానికి ప్రధానమంత్రి మోదీ అవుతారని విశ్వసిస్తున్నని, ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ చెప్పారు. “కష్టసుఖాల్లో నేను ఆయనకు అండగా నిలబడాలనుకుంటున్నాను. దేశానికి ఆయన అవసరం ఉంది” అని పవన్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.
Read Also : Lingamaneni Ramesh : జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారు
తండ్రి మాటల ప్రభావంతో :
తన తండ్రి మాటలు తననెంత ప్రభావం చేశాయో కూడా పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తండ్రి తరచుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలను ఉత్తేజపరిచే బలమైన జాతీయ నాయకుడి అవసరం గురించి చెప్పేవారని అన్నారు. ఆ దృష్టితోనే తాను దేశాన్ని ఏకం చేయగల నాయకుడిని వెతుకుతున్న సందర్భంలో గుజరాత్ సీఎంగా మోదీ చేసిన పనిని తాను నిశితంగా గమనించినట్టు పవన్ గుర్తు చేసుకున్నారు.
మోదీ 12ఏళ్ల పాలన అద్భుతం :
మోదీ నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు, సరిహద్దు భద్రతను బలోపేతం చేసే ప్రయత్నాలను ఆయన సంకల్పానికి ఉదాహరణలుగా పవన్ పేర్కొన్నారు. గత పన్నెండేళ్ల మోదీ పాలనను “అద్భుతమైన విజయం”గా అభివర్ణించారు. దేశంలోని విభిన్న ప్రాంతాల ప్రజలతో మోదీ కలిసే విధానం కూడా అసాధారణమని చెప్పారు.
మోదీ వంటి నాయకుడు లేరు :
“ఆయన ఢిల్లీలో కూర్చున్నా.. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఏర్పరచుకుంటారు. ఏ భాష, ఏ సంస్కృతి అయినా ఆయనతో కనెక్ట్ అవుతారు. గతంలో ఏ ప్రధానికి కూడా ఇలాంటి అనుబంధం ప్రజలతో లేదు” అని పవన్ మోదీని కొనియాడారు.
ప్రధాని మోదీ పట్ల తనకు స్థిరమైన నిబద్ధత వ్యక్తిగతమైనదే కాదని, రాజకీయ విశ్వాసమని కూడా ఇంటర్వ్యూలో పవన్ స్పష్టంగా చెప్పారు. “కష్టసుఖాల్లో నేను ఆయనకు అండగా ఉంటాను” అని పదే పదే తన మద్దతును పవన్ ప్రకటించారు.
