Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir : 500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇవాళ్టితో తెరపడనోంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిల్లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1గంటకు ముగియనుంది. ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ సందర్భంగా.. రామ మందిరాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది.
Also Read : Ayodhya Ram Mandir : అయోధ్యలో సూపర్ స్టార్, పవర్ స్టార్.. వీడియోలు వైరల్..
రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది. అయోధ్య నగరం మొత్తం వేల క్వింటాళ్ల పూలతో అలంకరించారు. రామాలయాన్ని మూడువేల కిలోల పూలతో అలంకరించారు. అయోధ్య ధామ్ లోని ప్రతీ ప్రదేశం దేదీప్యమానంగా ఉంటుంది. అయోధ్యకు వెళ్లే వివిధ రహదారులనుకూడా పువ్వులు, దీపాలతో అలంకరించారు. దేశంలోని వందలాది దేవాలయాల్లో రామ్ చరిత్ మానస్ పారాయణం జరుగుతోంది.
Also Read : Ayodhya: ముగియనున్న మోదీ 11 రోజుల దీక్ష.. అందరి నోటా సకల గుణాభిరాముడు నడయాడిన నేల ‘అయోధ్య’ మాట..
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వమిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిధ్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు ట్రస్టు తెలిపింది. మొత్తం 2గంటలపాటు మంగళ ధ్వని కార్యక్రమం ఉంటుంది. రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేల మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులు ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గోనున్నారు.