ఒళ్లు నొప్పులు, వెన్ను నొప్పి, కడుపు నొప్పి, దద్దుర్లు, వికారం.. కరోనా బాధితుల్లో మరికొన్ని కొత్త లక్షణాలు

కరోనాలో రోజురోజుకు కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవి అని నిపుణులు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరికొన్ని కొత్త లక్షణాలు చేరాయి. ఒళ్లు నొప్పులు, వికారం.. ఇవి కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు.

తీవ్రమైన వెన్ను నొప్పి:
కొవిడ్-19ను ముందుగా గుర్తించడానికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాల మీద ఆధారపడితే సరిపోదని నిపుణులు అంటున్నారు. కరోనా బాధితుల్లో వెన్నునొప్పి, కడుపు నొప్పి, దద్దుర్లు, మోకాలి కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడిస్తున్నారు. కొందరిలో డయేరియా సమస్య ఊహించినదానికంటే అధికంగా ఉందన్నారు. ‘ఒళ్లు నొప్పులు వంటి అసాధారణ లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి. కొంతమందికి కాలు కింది భాగంలో నొప్పి మినహా మరే లక్షణాలు ఉండటం లేదు’ అని కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందంలోని సభ్యుడైన డాక్టర్ శశాంక్ జోషి వెల్లడించారు. నిర్ధారణ పరీక్షలకు ముందు 200 మంది కొవిడ్ అనుమానితులకు చికిత్స అందించిన సీనియర్ వైద్యులు జలీల్ పార్కర్ మాట్లాడుతూ..వారిలో చాలామంది వెన్నునొప్పితో బాధపడ్డారని వెల్లడించారు. తరవాత వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఒళ్లు నొప్పులతో పాటు కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు:
కొవిడ్ రోగులు వికారంతో బాధపడటడం సర్వసాధారణ సమస్యగా ఉందని టాస్క్‌ఫోర్స్‌లో మరో సభ్యుడు, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఓం శ్రీవాస్తవ అన్నారు. ‘ఒళ్లు నొప్పులతో పాటు కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి. కొద్దిపాటి జ్వరం కూడా కొవిడ్‌ లక్షణంగా కనిపిస్తోంది’ అని గ్రాంట్ మెడికల్ కాలేజ్‌కి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్ హేమంత్ గుప్తా వెల్లడించారు. చక్కెర స్థాయులు(షుగర్ లెవెల్స్) అదుపుతప్పడం కూడా వైద్యులకు ఒక చిహ్నంగా భావిస్తున్నారు. వారికి అధిక మొత్తంలో ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం వస్తోందని తెలిపారు. దద్దుర్లు, దురద వంటి లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్లు వాక్‌హార్డ్ ఆసుపత్రులకు చెందిన వైద్యుడు ఒకరు తెలిపారు.

ముక్కు కారడం, వికారం లేక వాంతులు:
కాగా, ముక్కు కారడం, వికారం లేక వాంతులు, నీళ్ల విరేచనాలను కొవిడ్ లక్షణాల జాబితాలో కొత్తగా చేర్చింది అమెరికన్ సెంటర్స్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ). ఇటీవల ఐసీఎంఆర్ కూడా రుచి, వాసనను కోల్పోవడం వంటి లక్షణాలను ఈ జాబితాలో చేర్చింది. జ్వరం, పొడిదగ్గు, అలసట సహజంగా కనిపించే లక్షణాలు కాగా..వీటికి అదనంగా కొత్తగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

జీర్ణ సంబంధిత లక్షణాలు, ఆకలి లేకపోవడం:
అయితే కరోనా సోకినప్పటికీ.. ఈ లక్షణాలేమీ కనిపించని వారిలో విరేచనాలు, జీర్ణ సంబంధిత లక్షణాలు, ఆకలి లేకపోవడం వంటివి కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి కూడా కరోనా సోకవడం వల్లే వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన గుర్తుపట్టకపోవడం, గొంతు మంట, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా కరోనా లక్షణాలే అని డాక్టర్లు చెబుతున్నారు.

ఏ చిన్న మార్పు వచ్చినా కరోనా సోకిందేమోననే భయం:
కరోనాకు సంబంధించి రోజురోజుకి కొత్త కొత్త లక్షణాలు వెలుగుచూస్తుండటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. తమ ఆరోగ్యంలో ఏ చిన్న మార్పులు కనిపిస్తున్నా కరోనా పరీక్షలు కోసం పరుగులు పెడుతున్నారు. కొందరు తమలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.

కరోనా లక్షణాలు:
జ్వరం
వణుకు
దగ్గు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
అలసట
ఒళ్లు నొప్పులు
తలనొప్పి
రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం
గొంతునొప్పి
ముక్కు దిబ్బడ
వాంతులు
డయేరియా
ఒళ్లు నొప్పులు
వెన్ను నొప్పి
దద్దుర్లు
వికారం
నీళ్ల విరేచనాలు
ముక్కు కారడం
కడుపులో నొప్పి

Read:లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : రక్తంలో 20 శాతం పెరిగిన షుగర్ లెవల్