గుడ్‌న్యూస్‌.. బ్యాంకుల సమ్మె వాయిదా.. ఈ 2 రోజులు మూతపడవు.. హాయిగా బ్యాంకు పనులు చూసుకోవచ్చు..

యూఎఫ్‌బీయూ, సెంట్రల్ లేబర్ కమిషనర్ మధ్య ఇవాళ సమావేశం జరిగింది.

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మార్చి 24, 25 తేదీల్లో ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సమ్మె చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, యూఎఫ్‌బీయూ, సెంట్రల్ లేబర్ కమిషనర్ మధ్య ఇవాళ సమావేశం జరిగింది. దీనిపై చర్చలు జరిపిన తరువాత రెండు రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె నిర్ణయాన్ని యూఎఫ్‌బీయూ వెనక్కి తీసుకుంది.

అన్ని క్యాడర్లలో నియామకాలతో పాటు వారానికి ఐదు రోజుల పనిదినాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం యూఎఫ్‌బీయూ ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగి సమావేశం ఫలవంతమైనదంటూ యూఎఫ్‌బీయూ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐదు రోజుల పనిదినాల డిమాండ్ అమలు విషయాన్ని తాను వ్యక్తిగతంగా పరిశీలిస్తానని కేంద్ర కార్మిక కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయాలని తాము నిర్ణయించుకున్నామని పేర్కొంది. తదుపరి రౌండ్ చర్చలు ఏప్రిల్ మూడవ వారంలో జరగనున్నాయి.

యూఎఫ్‌బీయూ మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సమ్మె జరిగితే మార్చి 22 నుంచి మార్చి 25 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగేది. ఎందుకంటే మార్చి 23న కూడా బ్యాంకులకు సెలవు దినం ఉంది. సమ్మె జరిగితే దీనివల్ల నగదు లావాదేవీలు, చెక్ క్లియరింగ్, చెల్లింపులు, రుణాల ప్రక్రియ వంటి వాటిపై ప్రభావం పడేది.

యూఎఫ్‌బీయూలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ సహా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. ఈ ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. యూఎఫ్‌బీయూ డిమాండ్లలో ప్రస్తుత ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించడానికి, కస్టమర్ సేవలను మెరుగుపరచడానికి అన్ని కేడర్లలో సిబ్బందిని నియమించాలన్న డిమాండ్ కూడా ఉంది.

Also Read: కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీట్రాప్ వివాదం.. 18 మంది బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌.. వారిని ఎలా మోసుకెళ్లారో చూడండి..