Minimum Balance Charges : బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ లేనందుకు రూ.7087 కోట్లు వసూళ్లు!
Minimum Balance Charges : దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయని ఖాతాదారుల నుంచి మొత్తం రూ.7,087 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేశాయి.
- Harish Thanniru
- Published on- July 29, 2026 / 02:22 PM IST
Minimum Balance Charges
Minimum Balance Charges : బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ (Minimum Average Balance) లేకపోతే చెల్లించే జరిమానాలు చిన్న మొత్తాలే అనుకుంటే పొరపాటే. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఈ ఒక్క కారణంతోనే ఏడాదిలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ నిబంధన ఉల్లంఘించిన ఖాతాదారుల నుంచి మొత్తం రూ.7,087 కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల వాటా అధికంగా ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధిక వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు బ్యాంకింగ్ చార్జీలపై మరోసారి చర్చకు దారితీశాయి.
Also Read : Abhijit Deepke : మా అమ్మాయిని చేసుకోండి.. లేదు లేదు.. మా అమ్మాయినే..! అభిజిత్ దీప్కేతో పెళ్లికి క్యూ..
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయని ఖాతాదారుల నుంచి మొత్తం రూ.7,087 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేశాయి. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. 19 ప్రైవేట్ బ్యాంకులు రూ.4,949 కోట్లు, 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2,138 కోట్లు వసూలు చేశాయని తెలిపారు.
ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ బ్యాంకు ఒక్కటే రూ.1,798.14 కోట్లు వసూలు చేయగా, యాక్సిస్ బ్యాంక్ రూ.1,081.33 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు బ్యాంకులే ప్రైవేట్ బ్యాంకుల మొత్తం వసూళ్లలో సుమారు 58 శాతం వాటా కలిగి ఉన్నాయి. అయితే, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన ఖాతాలు సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు కనీస బ్యాలెన్స్ నిబంధన వర్తించదని, వాటిపై ఎలాంటి జరిమానా విధించబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
