ఆ జడ్జిపై ఓ లాయరుకు కోపం వచ్చింది. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని అతడి కోపం.. అందుకే కరోనా వైరస్ సోకాలంటూ హైకోర్టు జడ్జిని శపించాడు. ఈ ఘటన కోల్ కతాలో జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కోర్టులు సైతం అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్న పరిస్థితి ఉంది. బిజోయ్ అనే న్యాయవాది కోల్ కతా హైకోర్టులో బ్యాంకుకు లోన్ చెల్లించని ఓ కేసులో ఒక పిటిషనర్ తరపున కోర్టులో వాదించారు.
తీసుకున్న లోన్ చెల్లించలేదనే కారణంగా పిటిషనర్‌కు బస్సును జనవరి 15న బ్యాంకు వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆ పిటిషనర్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. ఇది అత్యవసర విషయం కాదని కోర్టు పరిగణించి వేసవి సెలవుల తరువాత విచారిస్తామని జడ్జి దీపంకర్ దత్తా ఆదేశాలు జారీ చేశారు.
అంతే.. లాయర్ బిజోయ్ ఆగ్రహంతో ఊగిపోయారు. తన చేతిలో మైక్రోఫోన్ విసిరికొట్టేశారు. అదే ఆవేశంతో జడ్జికి కరోనా సోకాలంటూ శాపనార్థాలు పెట్టేశాడు. లాయర్ వ్యవహారశైలితో షాకైన జస్టిస్ దత్తా.. కోర్టు ధిక్కారం కింద బిజోయ్ పై చర్యలకు ఆదేశించారు. లాయర్ శాపనార్థాలతో తనకు ఎలాంటి భయం లేదని, కోర్టు ప్రాధాన్యతే ముఖ్యమన్నారు.
కోర్టు ఆదేశాలను న్యాయవాది పట్టించుకోనట్లు అనిపించింది. గొప్ప న్యాయవాద వృత్తిలో సభ్యునిగా ఉండి కోర్టులో గట్టిగా కేకలు వేస్తూ వ్యవహరించడం సరైనది కాదు. ఈ న్యాయస్థానం గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేరపూరిత ధిక్కారమని భావించిన జస్టిస్ దత్తా మార్చి 23న న్యాయవాదిపై సుమోటు జారీ చేశారు.