ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో.. ఇక అంతే.. ఇప్పుడు ఏం జరుగుతోందంటే?
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారు తమ బకాయిలను వెంటనే చెల్లించేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురావాలనుకుంటోంది.

Traffic Challan
Traffic Challan: ట్రాఫిక్, మోటార్ వాహన నిబంధనలను ఉల్లంఘించే వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంటోంది. ఇటీవలే కేంద్ర రవాణా శాఖ ముసాయిదా ప్రకటన విడుదల చేసింది.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి పోలీసులు చలాన్లు పంపుతారన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కొత్త రూల్స్ ప్రకారం.. వాహనదారులు ఆ చలాన్లకు స్పందించకపోతే వారి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌ను అధికారులు బ్లాక్ చేస్తారు. (Traffic Challan)
వాహనదారులు చలాన్లకు త్వరగా స్పందించి, చెల్లించాలి.. లేదంటే తాను ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని 45 రోజుల్లో అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఈ రెండింట్లో ఏది చేయకపోయినా వారి డ్రైవింగ్, వాహన రిజిస్ట్రేషన్ బ్లాక్ అయిపోతుంది.
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ద్వారా నోటిఫై చేసిన ఈ ప్రతిపాదిత మార్పుల్లో పలు అంశాలను పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి సంబంధించిన లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ దరఖాస్తులను ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్టీఓ) ప్రాసెస్ చేయవు.
ఇలాంటి వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్.. వాహన్, సారథి పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకోలేరు. అంటే, మీ డ్రైవింగ్ లైసెన్సును రెన్యువల్ చేసుకునే వీలు ఉండదు. 5 కన్నా ఎక్కువ చలాన్లు ఉంటే లైసెన్స్ మొత్తానికి రద్దు కావచ్చు. రూల్స్ ఉల్లంఘిస్తే వాహనదారులకు 3 రోజుల్లో ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసు జారీ చేసి, ఫిజికల్ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని అధికారులకు కేంద్రం సూచిస్తోంది.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారు తమ బకాయిలను వెంటనే చెల్లించేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు తీసుకురావాలనుకుంటోంది. అయితే, ఈ మార్పులను అమలు చేయడానికి ముందు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ హోల్డర్స్ చలాన్ల పట్ల అభ్యర్థన చేసుకునే వ్యవస్థలు ఉండాలని నిపుణులు అంటున్నారు. వారు బకాయిలు చెల్లించాక వారి పేర్లను వెంటనే చెల్లింపుల జాబితా నుంచి తొలగించాలని చెబుతున్నారు.