జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తలసానికి తలనొప్పిగా మారిందా? కాంగ్రెస్ నుంచి బరిలో తలసాని ఇంటి అల్లుడు నవీన్ యాదవ్
మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిజంగానే సొంత పార్టీ అభ్యర్ది మాగంటి సునీతకు తలసాని మద్దతు ఇస్తే ఇంటి అల్లుడు నవీన్ యాదవ్‌ను విమర్శించాల్సిన పరిస్థితి.

Talasani Srinivsas
Talasani Srinivas Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించాయి. గులాబీ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ఖరారు చేయగా, హస్తం పార్టీ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ డిక్లేర్ చేసింది.
ఈ నేపథ్యంలోనే ఇంట్రెస్టింగ్ చర్చ తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న నవీన్ యాదవ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు దగ్గరి బంధువు. స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడే ఈ నవీన్ యాదవ్. దీంతో ఇప్పుడు తలసాని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సొంత పార్టీ బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయాల్సి ఉండగా..అల్లుడు నవీన్ యాదవ్కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాల్సి పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపు నిలుస్తారా, లేదంటే బంధుత్వం పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు లోపాయికారీగా మద్దతిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంచి అనుబంధం ఉండేది.
Also Read: నకిలీ మద్యం కేసు తర్వాత ఆ ప్రాంతంలో వేడెక్కిన రాజకీయం.. ఏం జరుగుతోంది?
ముందు నుంచి మాగంటి కుటుంబానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతుగా ఉంటూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించినప్పటి నుంచి..ఆమెకు మద్దతుగా తలసాని పనిచేస్తూ వస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ నవీన్ యాదవ్‌కు ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది.
కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్కు స్వయాన సోదరుడి అల్లుడు. అంటే నవీన్ యాదవ్ తలసాని ఇంటి అల్లుడున్నమాట. మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తలసాని సపోర్ట్ ఎవరికన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా..నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో ఉన్నా..ఆయనకు అప్పుడప్పుడు రాజకీయ సలహాలు ఇచ్చేవాడినని స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ చెబుతూ వస్తున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేయబోతున్నారు?
మరిప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిజంగానే సొంత పార్టీ అభ్యర్ది మాగంటి సునీతకు తలసాని మద్దతు ఇస్తే ఇంటి అల్లుడు నవీన్ యాదవ్‌ను విమర్శించాల్సిన పరిస్థితి. అందుకే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేయబోతున్నారన్నది రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
అయితే నవీన్ యాదవ్తో బంధుత్వం వేరు, బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అనుబంధం వేరని అంటున్నారట తలసాని. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారట. అలాంటప్పుడు తాను నవీన్ యాదవ్కు ఎలా మద్దుతు ఇస్తానని తలసాని ప్రశ్నిస్తున్నారట. నవీన్తో తనకు బంధుత్వం ఉన్న మాట వాస్తవమేనని, గతంలో అతడికి రాజకీయ సలహాలు కూడా ఇచ్చానని గుర్తు చేస్తున్నారట.
తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఎంత కాదన్నా అధికార కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ఇంటి అల్లుడు కావడంతో ఎక్కడో అక్కడ కొంత ప్రేమ ఉంటుందన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అందుకే తలసానిపైకి సొంత పార్టీకి మద్దతు తెలిపినా.. అంతర్గతంగా ఇంటి అల్లుడు నవీన్ యాదవ్కు గెలవాలని కోరుకోవచ్చని అంటున్నారు. ఏదేమైనా జూబ్లీహిల్స్ బైఎలక్షన్ తలసానికి కాస్త ఇబ్బందికరంగా మారిందన్న టాక్ అయితే వినిపిస్తోంది.