నకిలీ మద్యం కేసు తర్వాత ఆ ప్రాంతంలో వేడెక్కిన రాజకీయం.. ఏం జరుగుతోంది?

పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్‌నే నియోజకవర్గ ఇంచార్జ్‌గా అధికారికంగా ప్రకటిస్తే తప్ప..తంబళ్లపల్లిలో టీడీపీ నిలదొక్కుకునే పరిస్థితి లేదని అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు.

నకిలీ మద్యం కేసు తర్వాత ఆ ప్రాంతంలో వేడెక్కిన రాజకీయం.. ఏం జరుగుతోంది?

Tdp

Updated On : October 11, 2025 / 8:43 PM IST

TDP Politics: మొన్నటి దాకా ఒక లెక్క. ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీ రాజకీయం. మొన్నటి వరకు పార్టీలో కీలకంగా పనిచేసిన జయచంద్రారెడ్డి ఈ మధ్యే నకిలీ లిక్కర్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయితే జయచంద్రారెడ్డి పార్టీలో ఉన్నంత కాలం..నియోజకవర్గంలో గ్రూప్ వార్ నడిచింది.

మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌, జయచంద్రారెడ్డి మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఆ ఇద్దరిలో ఎవరు నియోజకవర్గ ఇంచార్జో తెలియక క్యాడర్‌ అయోమయంలో కొనసాగింది. ఈ ఇద్దరు లీడర్లు కూడా ఎవరికి వారుగా పనిచేసుకుంటూ పోయారు. ఇప్పుడు జయచంద్రారెడ్డిని పార్టీ సస్పెండ్ చేయడంతో..తంబళ్లపల్లి టీడీపీ ఇంచార్జ్ పోస్ట్‌ రేసు మరోసారి తెరమీదకు వచ్చింది.

జయచంద్రారెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ మధ్య కోల్డ్ వార్ నడిచింది. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడంతో ఇక శంకర్‌యాదవ్‌కే తంబళ్లపల్లి ఇంచార్జ్‌ బాధ్యతలు ఇస్తారనుకుంటే..తెలుగు యువత నాయకుడు శ్రీరాం చిన్నబాబు రేసులోకి వచ్చారట. దీంతో తంబళ్లపల్లి టీడీపీ ఇంచార్జ్‌ పోస్ట్ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

Also Read: తెలంగాణలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు..! రేవంత్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారు?

టీడీపీ ఆఫీస్‌లో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను శంకర్ యాదవ్ వర్గీయులు కలిశారు. శ్రీరాం చిన్నబాబు కూడా టీడీపీ పెద్దలతో టచ్‌లో ఉంటున్నారట. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తారన్న ఆసక్తికరంగా మారింది. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ వైపు లోకల్ లీడర్లంతా మొగ్గు చూపుతున్నారట.

గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు..క్యాడర్‌కు అందుబాటులో ఉంటారని..ఆయన ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తేనే పెద్దిరెడ్డి కుటుంబాన్ని సమర్థవంతంగా ఢీకొట్టగలరని అభిప్రాయపడుతున్నారట కార్యకర్తలు. 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథ రెడ్డి గెలిచారు. 2014లో టీడీపీ తరఫున శంకర్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందగా..2019, 2024 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైసీపీ ఈ సీటును కైవసం చేసుకుంది.

మొన్నటి ఎన్నికలప్పుడు తంబళ్లపల్లిలో టీడీపీ లాస్ట్ మినిట్‌లో చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అప్పటి వరకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌ను కాదని, జయచంద్రారెడ్డి అనే కొత్త నేతకు టికెట్ కట్టబెట్టింది పార్టీ. పదివేల ఓట్ల తేడాతో జయచంద్రారెడ్డి ఓడిపోయారు. టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తీవ్ర నిరాశకు గురయ్యారు.

గట్టిగా ప్రయత్నం చేస్తున్న శంకర్‌ యాదవ్

ఎన్నికల తర్వాత జయచంద్రారెడ్డి, శంకర్ యాదవ్‌లలో ఎవరు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ అన్నది క్లారిటీ లేకపోవడంతో.. మొన్నటివరకు తంబళ్లపల్లి తెలుగు తమ్ముళ్ల మధ్య పంచాయితీ నడిచింది. ఇప్పుడు జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో బుక్కవడంతో..టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పోస్ట్‌ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు శంకర్‌ యాదవ్.

అయితే 2024 ఎన్నికల ముందు వరకు ఇంచార్జ్‌గా ఉన్న శంకర్ యాదవ్‌కి టికెట్ కేటాయిస్తే..ఇప్పుడు లిక్కర్ విషయంలో టీడీపీ బద్నాం కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదని క్యాడర్ భావిస్తోందట. యాదవ, బీసీ సామాజిక వర్గాల సపోర్ట్‌ శంకర్ యాదవ్‌ బలంగా ఉందట. పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన జయచంద్రారెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వడమే రాంగ్ స్టెప్ అని లోకల్ లీడర్లు గుసగుసలు పెట్టుకుంటున్నారట.

జయచంద్రారెడ్డి గతంలో పెద్దిరెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్టులు కూడా తీసుకునేవారని శంకర్‌యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ శంకర్ యాదవ్‌నే నియోజకవర్గ ఇంచార్జ్‌గా అధికారికంగా ప్రకటిస్తే తప్ప..తంబళ్లపల్లిలో టీడీపీ నిలదొక్కుకునే పరిస్థితి లేదని అంటున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. సైకిల్ పార్టీ అధిష్టానం కూడా శంకర్‌ యాదవ్‌ వైపే మొగ్గు చూపుతుందని..ఆయనకే తంబళ్లపల్లి ఇంచార్జ్ బాధ్యతలు ఇస్తారని పార్టీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి మరి.