తెలంగాణలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు..! రేవంత్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారు?
దేవాదాయశాఖకు చెందిన ఓ టెండర్‌ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది.

Telangana Congress: ఇష్యూ ఏదైనా..మ్యాటర్ మరేదైనా.. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ ఏదో ఒక రచ్చతో హాట్ టాపిక్‌గా ఉంటున్నారు. ఒక మంత్రి అయిపోగానే..మరో మంత్రి.. ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు మంత్రులు కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. అధిష్టానమో..పార్టీ రాష్ట్ర పెద్దలో..లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డో స్వయంగా ఇన్వాల్వ్ అయి ఇష్యూ సెటిల్ చేసే వరకు రచ్చరంబోలా చేస్తున్నారు. ఇలా ఒక వివాదం ముగుస్తుందో లేదో మరో ఇష్యూతో మళ్లీ న్యూస్ హెడ్‌లైన్‌గా మారుతున్నారు తెలంగాణ మంత్రివర్యులు.
మొన్నటి వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పొన్నం వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య దున్నపోతు కామెంట్స్ దుమారం లేపితే..ఇప్పుడు ఇది వరంగల్‌కు పాకింది. జిల్లా మంత్రి కొండా సురేఖ, ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్ అవుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ..జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇదంతా సరే కానీ..అసలు వివాదం ఎక్కడ వచ్చిందనే కదా డౌట్. మేడారం జాతర పనుల టెండర్ల కేటాయింపు ఈ ఇద్దరి మధ్య లొల్లిని రాజేసిందట. (Telangana Congress)
Also Read: వైసీపీలో రీఎంట్రీకి ఆ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నారా? జగన్ సుముఖంగా లేరా?
వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర కోసం ప్రభుత్వం పనులు చేపడుతోంది. పైగా ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా మంజూరు చేసిన పనులు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మేడారంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మధ్య విబేధాలు వచ్చాయట. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి. పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్నారు.
అయితే దేవాదాయశాఖకు చెందిన ఓ టెండర్‌ను పొంగులేటి తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొండా వర్గం ఆరోపిస్తోంది. తన శాఖలో ఆయన జోక్యమేంటని ప్రశ్నిస్తూ సీఎంతో పాటు పార్టీ అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొండా మురళి కూడా మంత్రి పొంగులేటి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో సదరు మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నించడమే కాదు… పొంగులేటిపై కాంగ్రెస్ అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
మంత్రుల మధ్య టెండర్ల వార్ తెరపైకి..
మేడారం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా కొనసాగుతున్న పనులను మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రుల మధ్య టెండర్ల వార్ తెరపైకి రావటంతో పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఇద్దరు మంత్రుల మధ్య పంచాయితీ వెనుక మరో కారణం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. కాంట్రాక్ట్ పంపకాల్లో తేడాలవల్లే విషయం రచ్చకెక్కిందనే టాక్ నడుస్తోంది.
తన జిల్లాలో..పైగా తన శాఖలో జరిగే పనుల్లో పొంగులేటి జోక్యం ఏంటని సన్నిహితుల దగ్గర కొండా సురేఖ వాపోతున్నారట. ఇదే విషయంలో అంతర్గత పోరు కాస్త ఇప్పుడు రచ్చకెక్కినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మధ్యే మంత్రి పొన్నం చేసిన దున్నపోతు కామెంట్స్‌పై పెద్ద దుమారమే లేచింది. దళిత సంఘాలు, మంత్రి అడ్లూరి డిమాండ్‌తో పెద్ద రచ్చ అయింది.
దీంతో పీసీసీ చీఫ్ ఇద్దరు మంత్రులతో మాట్లాడి..పొన్నంతో క్షమాపణ చెప్పించి..అందరూ కలిసి టిఫిన్ చేసి ఇష్యూ సమసిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఆ ఇష్యూ అలా చల్లబడ్డదో లేదో ఒక్క రోజు గ్యాప్లోనే మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ వార్ వెలుగులోకి వచ్చింది. మరి ఈ వివాదానికి పార్టీ పెద్దలు, సీఎం రేవంత్ ఎలా ఫుల్ స్టాప్ పెడుతారో చూడాలి మరి.