బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక ఈ బీరు దొరకడం కష్టమే..!
బిరా 91 చేసిన చిన్న మిస్టేక్ ఏంటి? అన్ని సంస్థలకూ ఇది ఓ పాఠం అవుతుందా?

Bira beer
Bira beer: బిరా 91.. రెండు-మూడేళ్ల క్రితం వరకు భారత్‌లో ఈ బీర్ అంటే చాలా మంది పడిచచ్చేవారు. ఈ బీరు తాగని జన్మెందుకు? అని తాగుబోతులు మాట్లాడుకునేవారు. మంచి పేరు, దాని ఫన్ బాటిళ్లు, మార్కెటింగ్, యువతకు అనుకూలమైన ఇమేజ్‌తో మందుబాబులను బిరా 91 తనవైపునకు తిప్పుకుంది.
ఇంతగా పేరు తెచ్చుకున్న ఈ బీర్ ఇప్పుడు మాత్రం చతికిలపడుతోంది.. ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతోంది. 2015లో అంకూర్ జైన్ ప్రారంభించిన బిరా 91.. భారత్‌లో కొత్త క్రాఫ్ట్ బీరు సంస్కృతి ప్రతీకగా మారింది. దాని కూల్ బ్రాండింగ్, క్రియేటివ్ యాడ్స్, మార్కెట్లో ఈ బీర్లు విస్తృతంగా లభించడంతో యువతకు బాగా ఆకర్షించింది. 2023కి, బిరా 91 ప్రతిష్టాత్మక మైలురాయిని చేరింది.
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం రూ.824 కోట్ల ఆదాయం సాధించి, భారత్‌లో 550 నగరాలు, ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో 9 మిలియన్ కేసులు అమ్మింది. కానీ, గత సంవత్సరం తొలి ఆరు నెలలలో కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రభుత్వ నియమాలు, ఆర్థిక ఒత్తిడి, అంతర్గత సమస్యల వల్ల కుదేలైంది. ఆ కంపెనీ 2024 ఆర్థిక ఏడాదిలో రూ.748 కోట్ల నికర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
Also Read: ఇడ్లీతో గూగుల్ డూడుల్ అక్టోబర్ 11న ఎందుకు కనపడుతోంది? ప్రపంచ ఇడ్లీ దినోత్సవం కాదు కదా?
బిరా 91 చేసిన మిస్టేక్ ఏంటి?
బిరా 91 కంపెనీలో సమస్యలు ప్రారంభమైనప్పుడు చిన్న మార్పు చేశారు. దాని పేరులోని “ప్రైవేట్” పదాన్ని తీసివేశారు. 2023-24లో, బీ9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా బీ9 బేవరేజెస్ లిమిటెడ్ అయింది. కానీ ఈ సాధారణ చట్టపరమైన మార్పు ఆ కంపెనీపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
ఇన్వెస్టర్ డి. ముత్తుకృష్ణన్ ఎక్స్‌లో దీనిపై స్పందిస్తూ.. “బిరా 91 గత దశాబ్దంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్‌లలో ఒకటి. కానీ, చిన్న పేపర్ వర్క్ పొరపాటు కలకలం సృష్టించింది. రాష్ట్రాలు ఈ కంపెనీ కొత్త పేరును పూర్తిగా వేరే వ్యాపారంగా పరిగణించాయి” అని చెప్పారు.
కొత్త పేరు రిజిస్టర్డ్ అయిన వెంటనే ప్రభుత్వం బిరా 91 అమ్మకాలను ఆపింది. కంపెనీకి కొత్త ఉత్పత్తి, లేబుల్ ఆమోదాలు, కొత్త లైసెన్సులు, ప్రతి బీరు వేరియంట్ కోసం వేరే రిజిస్ట్రేషన్లు అవసరమని చెప్పింది. ఈ గందరగోళం నెలల కొద్దీ అమ్మకపు నష్టాలు, భారీ ఆర్థిక నష్టాలకు దారితీసింది. ఆ తర్వాత కూడా సమస్య మరింత పెరిగింది. ఆ కంపెనీలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్న బ్లాక్ రాక్ ఆ తర్వాత వెనక్కి తగ్గింది.
2026కు ఐపీఓ ప్రణాళికలు
ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఈ కంపెనీ ఐపీఓ విషయంలో మాత్రం ఆశలు వదులుకోవడం లేదు. 2026లో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం ప్రణాళికలు వేసుకుంటోంది. సీఈఓ అంకూర్ జైన్ ఐపీఓ ప్లాన్లలో మార్పులు లేవని చెప్పారు.
లిస్టింగ్‌కు సిద్ధం కావడానికి, మోర్గన్ స్టాన్లీను ప్రీ-ఐపీఓ ప్రక్రియకు సలహాదారుగా నియమించింది. బీ9 బేవరేజెస్ కార్యకలాపాలను సరళీకరించి, పబ్లిక్ మార్కెట్ల కోసం దాన్ని సిద్ధం చేసేందుకు మోర్గన్ స్టాన్లీ సాయం చేస్తుంది.
మోర్గన్ స్టాన్లీ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ. ఇది పెట్టుబడులు, ఫైనాన్స్ సలహాలు, స్టాక్ మార్కెట్, కంపెనీల ఐపీఓలలో సాయం చేస్తుంది.