Taliban
Taliban : పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బతుకు భారంగా మారిందని వాపోతున్నారు. ధరలు తగ్గించాలని గగ్గోలు పెడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాదు, ధరలు తగ్గించడం అసాధ్యం అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంధన ధరల పెరుగుదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం కంపెనీలకు జారీ చేసిన ఆయిల్ బాండ్ల కారణంగా చమురు ధరలు తగ్గించడం సాధ్యం కావడం లేదని ఆమె వివరించారు.
ఇది ఇలా ఉంటే, కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ ఇంధన ధరల పెరుగుదలకు చెప్పిన కారణం హాట్ టాపిక్ గా మారింది. ఆయన చెప్పిన రీజన్ విని అందరికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు తాలిబన్లు కారణమన్నారు ఎమ్మెల్యే అరవింద్.
పెట్రో, గ్యాస్ ధరల పెరుగుదలపై హుబ్లీ – ధార్వాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ చెప్పిన సమాధానం వైరల్ గా మారింది. ‘అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభం వల్లే భారత్‌లో పెట్రో, గ్యాస్ ధరలు పెరిగాయి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ వ్యవహారం నడుస్తోంది. దీంతో చమురు ధరల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి. అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో తెలుసుకునేంత జ్ఞానం ఓటర్లకు లేదు. ధరలు పెరుగుతున్నాయని ఊరికే ప్రభుత్వాన్ని తిడతారు’ అని బల్లాడ్ వివరించారు.