NIA
NIA searched by human trafficking case : దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి మొత్తం 10 రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, పుదుచ్చేరి, రాజస్థాన్,జమ్మూ అండ్ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు జరుపుతోంది.
ఆయా రాష్ట్రాల్లోని పోలీసులను సమన్వయం చేసుకుంటు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నివాసాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్న మానవ అక్రమ రవాణా రాకెట్ ను వెలికి తీసేందుకు 10 రాష్ట్రాల్లో దాదాపు 50 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కెనడాకు వలస వెళ్లేందుక చట్టపరమైన డాక్యుమెంటేషన్ ను పొందటం. ఉపాధి అవకాశాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని అమాయక ప్రజలను నమ్మించి అక్రమంగా తరలిస్తున్న ముఠాలపై ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు.
కాగా..గత నెలలో పరారీలో ఉన్న నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ను బెంగళూరుకు చెందిన ఎన్‌ఐఏ బృందం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక మానవ అక్రమ రవాణా కేసులో తమిళనాడు నుంచి పరారీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను బెంగళూరు NIA అధికారులు అరెస్ట్ చేశారు.శ్రీలంకకు చెందినవారిని ఇమ్రాన్ ఖాన్ గ్యాంగ్ బెంగళూరు, మంగళూరులోని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేయటంతో ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు.
ఉపాధి అవకాశాల కోసం కెనడా వంటి ఇతర దేశాలకు వెళ్ళేవారిని టార్గెట్ చేసి ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్న దుర్మార్గులపై ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఇటువంటి కేసులను దర్యాప్తు చేస్తున్న NIA తాజాగా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.
కాగా…భారత్ లో మానవ అక్రమ రవాణా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా ఆడబిడ్డలు అంగట్లో సరుకులుగా అక్రమ రవాణాకు గురవుతున్నారు. దేశంలో భారీ స్థాయిలో మానవ అక్రమ రవాణా జరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కేసుల్లో పట్టుబడినా ..కఠిన శిక్షలు అనుభవించినా ఈ రవాణా మాత్రం కొసాగుతునే ఉంది. దేశంలో ప్రతీ గంటకు చిన్నారులు, యువతులు మిస్ అవుతున్నారు. వారి ఆచూకీ మాత్రం లభ్యం కావటంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా ఈ దారుణాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. ఫలితంగా ఆడబిడ్డల పుట్టుక..మహిళా భద్రతపై ఆందోళన నెలకొంటోంది.
Tripura, Assam, West Bengal, Karnataka, Tamil Nadu, Telangana, Haryana, Puducherry, Rajasthan and Jammu & Kashmir are among the states being searched by the NIA in the human trafficking case.
— ANI (@ANI) November 8, 2023