Viral Video : మహిళతో ఆటో డ్రైవర్ తీవ్ర వాగ్వాదం.. ఓలా రైడ్ రద్దు చేసిందని చెంపదెబ్బ కొట్టాడు.. వీడియో!

Viral Video : ఓలా రైడ్ క్యాన్సిల్ చేసిందనే కారణంతో ఆటో డ్రైవర్ పట్టపగలే మహిళను చెంపదెబ్బ కొట్టాడు. ఇదంతా ఆ మహిళ తన ఫోన్‌లో రికార్డ్ చేయడంతో వైరల్‌గా మారింది.

Bengaluru Auto Driver Slaps Woman ( Image Source : Google )

Viral Video : బెంగళూరులో ఓ మహిళ పట్ల ఓలా ఆటో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఓలా ఆటో బుక్ చేసుకున్న మహిళ ఆ తర్వాత రైడ్ రద్దు చేసుకుంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆటోడ్రైవర్ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా మహిళను చెంపదెబ్బ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలేం జరిగిందంటే.. బెంగళూరులో ఓ మహిళ ఓలా ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. కానీ, తర్వాత ఆ రైడ్ రద్దు చేసి మరో ఆటోను ఎంచుకుంది. తన ఆటో రైడ్ రద్దు చేయడంతో కోపోద్రిక్తుడైన ఓలా ఆటో డ్రైవర్‌ ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ డ్రైవర్ మరో ఆటో డ్రైవర్ ముందే పట్టపగలు మహిళను చెంపదెబ్బ కొట్టాడు. ఇదంతా ఆ మహిళ తన ఫోన్‌లో రికార్డ్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని, లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మీ నాన్న గ్యాస్ కోసం చెల్లిస్తారా? ఆటోడ్రైవర్ ఆగ్రహం :
“ఆప్ చిల్లా క్యు రహే హో (ఎందుకు అరుస్తున్నారు)?” అని ఆ మహిళ పదే పదే అడగడం వీడియోలో కనిపించింది. కోపంగా ఉన్న ఆటో డ్రైవర్, “గల్తీ సే కైసే హోతా హై (అది ఎలా పొరపాటు)?” అని బదులిచ్చాడు. ఇంధన ఖర్చులను ఎవరు భరిస్తారు? “మీ నాన్న గ్యాస్ కోసం చెల్లిస్తారా?” అంటూ ఆమెను ప్రశ్నించాడు. ఆటో కేవలం ఒక నిమిషం దూరంలో ఉన్నప్పుడు ఓలా రైడ్‌ను రద్దు చేసినట్లు మహిళ అంగీకరించింది.

పరిస్థితి విషమించడంతో పోలీసులను ఆశ్రయిస్తానని మహిళ బెదిరించింది. అయితే, డ్రైవర్ మాత్రం వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని పట్టుబట్టాడు. పదే పదే ఆమెను తనతో పాటు రమ్మని కోరాడు. తన వద్ద అప్పటికే అతని ఫోన్ నంబర్, ఆటో వివరాలు ఉన్నాయని వేరే పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని మహిళ సూచించడంతో డ్రైవర్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.

ఆటో డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలి :
“మహిళల భద్రత చాలా ముఖ్యం. పగటిపూట ఈ వ్యక్తి రైడ్‌ను రద్దు చేసినందుకు మహిళపై దాడి చేశాడు. అదే రాత్రి వేళలో ఎవరూ లేని చోట అయితే మహిళల భద్రత పరిస్థితి ఏంటి అనేది ఊహించవచ్చు. బెంగళూరు సిటీ పోలీసులు.. ఈ ఆటోరిక్షా డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన మహిళలకు ప్రమాదం కలిగించడమే కాకుండా నగర ప్రతిష్టను దిగజార్చాయి.

ఓలా సపోర్ట్, డ్రైవర్‌లను నియమించుకునే ముందు క్షుణ్ణంగా బ్యాక్‌గ్రౌండ్ చెక్‌, క్యారెక్టర్ వెరిఫికేషన్‌ చేయడం తప్పనిసరి చేయాలి. అలాంటి సంఘటనలను నిరోధించడానికి ప్రయాణీకులందరికీ భద్రతకు కఠినమైన చర్యలు అమలు చేయడం చాలా అవసరం ”అని వీడియోకు పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Viral Video : కారు పార్కింగ్ విషయంలో వివాదం.. రోడ్డుపై రాడ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు