Punjab Aap
Punjab Election : మరికొన్ని వారాల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మాటల తూటాలతో ప్రచారాన్ని మరింత వేడిక్కిస్తున్నారు నాయకులు. అయితే ఇప్పటివరకు విడుదల అయిన పలు సర్వేలు.. పంజాబ్ లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని తెలిపాయి.
ఇదే సమయంలో ఇటీవల జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో..పోటీ చేసిన తొలిసారే అతిపెద్ద పార్టీగా ఆప్ అవతరించడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత జోష్ నెలకొంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి కేడర్ లో జోష్ నింపడమే కాకుండా..అనేక రకాల వాగ్దానాలతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఆ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ..భగవత్ మాన్ నే పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా పార్టీ ప్రకటించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంజాబ్ లో ఆప్ ఏకైక ఎంపీ అయిన భగవత్ మాన్ ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆప్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే పోరాడాలని సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన ఆలస్యంకావడానికి కారణం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కరోనా పాజిటివ్ గా నిర్థరణ కావడమేనని తెలుస్తోంది.
కాగా, గత నెలలో భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర ఆరోపణ చేశారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరితే భారీగా డబ్బు, కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామని ఓ సీనియర్ బీజేపీ నేత తనకు చెప్పారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇటువంటి ఆశలు పెట్టిన బీజేపీ నేత ఎవరో బహిరంగంగా చెప్పాలని భగవంత్ మాన్‌ను డిమాండ్ చేసింది.
ALSO READ Galwan Valley : గల్వాన్ లోయలో జాతీయ జెండా ఎగురవేసిన భారత ఆర్మీ