సగం ధరకే : పెళ్లి కార్డు చూపిస్తే కిలోఉల్లి రూ.35కే

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 04:51 AM IST
సగం ధరకే : పెళ్లి కార్డు చూపిస్తే కిలోఉల్లి రూ.35కే

Updated On : November 23, 2019 / 4:51 AM IST

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఆకాశన్నంటున్నాయి. దీంతో సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే భయపడుతున్నారు. కిలో ఉల్లిపాయలు రూ.70 నుంచి 100 వరకూ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక  ఇంట్లో పెళ్లి ఉందంటే ఎంత రేటైనా కొనక తప్పదు. ఇటువంటివారికి కాస్త ఉపశమనం కలించేలా తక్కువ ధరకే ఉల్లిపాయాల్ని విక్రయిస్తోంది బీహార్  స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ (బిస్కోమన్). పాట్నాలో పలు కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ ధరకంటే  అతి తక్కువ ధరకే అంటే కిలో రూ.80లు అమ్మే ఉల్లిని రూ.35కే అందిస్తోంది.

సామాన్యులకు రెండు కిలోల ఉల్లి ఇస్తుండగా, పెళ్లి కార్డు చూపించేవారికి 35 కిలోల ఉల్లిని ఇస్తోంది స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్. దీంతో సామాన్యులకు కాస్త ఉపశమనం కలుగుతోంది. వెడ్డింగ్ కార్డుపై ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు ముందుగా తమ పేరు, ఫోను నంబరు నమోదు చేసుకోవాల్సివుంటుంది.

ఈ విషయంపై బిస్కోమన్ అధ్యక్షుడు సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..అసలే ఉల్లి అధిక ధరలకు అమ్ముతున్న క్రమంలో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. అదే వివాహ సమయంలో ఉల్లిపాయలు కొనాలంటే మరింత భారంగా మారుతుందని అందుకే కొంతలో కొంత ఉపశమనం కలిగించేలా తాము ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
తాము సామాన్య ప్రజల కోసం  ఉల్లిపాయల్ని రాజస్థాన్ నుంచి కిలో రూ.60కి కొనుగోలు చేసి రూ.35కే అమ్ముతున్నామని తెలిపారు. మార్కెట్ లో ఉల్లి ధరలు తగ్గేంత వరకూ తాము ఇదే ధరకు అందజేస్తామన్నారు. ప్రస్తుతం పాట్నాలో పలు  కౌంటర్ల ద్వారా ఉల్లిని అందజేస్తున్నామనీ..త్వరలో బీహార్ లోని ఇతర ప్రాంతాలలో కూడా తమ కౌంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉల్లిపాయల కౌంటర్ల తమ సిబ్బంది 150 మంది వరకూ పనిచేస్తున్నారని తెలిపారు.

పాట్నాలోని బిస్కోమన్ భవన్, బోరింగ్ రోడ్ ఖండన, పాలిటెక్నిక్ టర్న్, సెక్రటేరియట్ మెయిన్ గేట్, కంకర్బాగ్ బస్ స్టాండ్, రాజా బజార్ బెయిలీ రోడ్ మొదలైన అనేక వార్డులలో మీరు బిస్కోమన్ వ్యాన్ నుండి తక్కువ ధరలకు ఉల్లిపాయలను కొనుగోలు చేయవచ్చు.