AP Local Body Elections: ఏపీలో లోకల్ ఫైట్.. వైసీపీ ముందున్న సవాళ్లు ఏంటి? ఎలా ఎదుర్కోబోతోంది?
స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే తమకు మెజార్టీ సీట్లు వస్తాయని ఫ్యాన్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. పార్లమెంటు.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది.
Ys Jagan Representative Image (Image Credit To Original Source)
- స్థానిక ఎన్నికలకు రెడీ అవుతోన్న కూటమి
- ఆరు నెలల్లో లోకల్ పోల్స్ పెట్టేలా అడుగులు
- స్థానిక పోరుకు వైసీపీ సిద్ధంగా ఉందా.?
- ఫ్యాన్ పార్టీ పరిస్థితులను బేరీజు వేసుకుంటుందా.?
AP Local Body Elections: ఆరు నెలల్లో లోకల్ ఫైట్. సీఎం చంద్రబాబు చెప్పిన మాటతో..ఏపీ పొలిటికల్ హీట్ నెమ్మదిగా పెరుగుతోంది. గ్రామాల్లో రాజకీయం వేడుక్కుతోంది. కూటమి సమరానికి సై అంటోంది. మరి స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందా? లోకల్ ఫైట్ కోసం ఆ పార్టీ దగ్గరున్న అస్త్రాలేంటి? కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఎలా ఎదుర్కోబోతుంది? పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక నుంచి ఫ్యాన్ పార్టీ నేర్చుకున్న పాఠాలు ఏంటి? స్థానిక పోరుపై పార్టీ నేతల మదిలో ఏముంది? క్షేత్రస్థాయిలో క్యాడర్ ఎన్నికలకు రెడీగా ఉందా?
ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు..పల్లె పోరుకు సిద్ధం కావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్‌ను పెంచేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సై అంటున్నా..ప్రతిపక్ష వైసీపీ పల్లె, పట్టణ పోరును ఎలా ఎదుర్కోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ 80 శాతం లోకల్ బాడీస్ వైసీపీ చేతుల్లోనే ఉండడంతో వీలైనంత త్వరగా..వాటిని స్వాధీనం చేసుకోవాలని కూటమి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
స్థానిక సంస్థల పోరులోనూ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫార్ములా..!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి వైసీపీకి ఏ ఎన్నికల్లోనూ ఫలితాలు సానుకూలంగా రావడం లేదు. కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీ..ఆ తర్వాత జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. పులివెందుల అయితే జగన్ సొంత ఇలాకా. అక్కడ కూడా సిట్టింగ్ జడ్పీటీసీ సీటును నిలబెట్టుకోలేకపోయింది ఫ్యాన్ పార్టీ. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం చర్చనీయాంశం అయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల పోరులో కూడా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫార్ములానే అనుసరించే యోచనలో అధికార పార్టీ నేతలు ఉన్నట్లు వైసీపీ డౌట్స్ వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటం వైసీపీకి సవాల్‌గా మారుతున్న పరిస్థితి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని సరిగా అమలు చేయడం లేదని వైసీపీ విమర్శిస్తూ వస్తోంది. అదే సమయంలో తాము అధికారంలో ఉండగా అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా నిలిపివేశారని వైసీపీ అధినేత జగన్ పదేపదే చెప్తూ వస్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ పర్యటనలు, యాత్రలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన..క్యాడర్ పోరాట పటిమ తమకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకుంటున్నారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న లెక్కల్లో ఫ్యాన్ పార్టీ ఉంది.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు పార్టీ అంచనాలకు విరుద్ధంగా రావడంతో, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని పలువురు వైసీపీ లీడర్లు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారట.
కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని డిమాండ్..
స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే తమకు మెజార్టీ సీట్లు వస్తాయని ఫ్యాన్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. పార్లమెంటు.. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ హవానే కనిపించింది. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహిస్తుందంటూ..అప్పుడు టీడీపీ ఎన్నికలను బహిష్కరించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వైసీపీ అసలు ప్లాన్ ఏంటో స్పష్టం కానుంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ లీడర్లు చాలామంది ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే సరైన నాయకుడు లేక క్యాడర్ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. మరోవైపు గత ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేశారు జగన్. ఆ ప్రయత్నం అనుకున్న ఫలితాలు తెచ్చిపెట్టలేదు. దీంతో ఎన్నికల తర్వాత జగన్ కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చారు. అయితే నియోజకవర్గ సమన్వయకర్తల మార్పులు, చేర్పులు అంతర్గత విభేదాలకు కారణం అవుతున్నాయనే చర్చ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను పక్కన పెట్టడం కొత్తవారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరుతో..నేతల్లో సమన్వయం కొరవడిందన్న వాదన వినిపిస్తోంది.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ డిసైడ్ అయితే..తమ వారికి టికెట్లు ఇవ్వాలనే డిమాండ్‌ను పార్టీ పెద్దల ముందు ఉంచేందుకు సిద్ధం అవుతున్నారు నేతలు. ఇంటర్నల్ క్లాషెస్ స్థానిక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు పలువురు వైసీపీ లీడర్లు. ఓవైపు అధికార కూటమి దూకుడు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం..వీటికి తోడు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు..స్థానిక పోరుపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయోనని వైసీపీ టెన్షన్ పడుతున్నట్లు ఇన్సైడ్ టాక్.
Also Read: ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల.. శాఖల వారిగా పోస్టులు, నోటిఫికేషన్ల తేదీలు ఇవే..
