Biparjoy: అరేబియా సముద్రంలో ఎక్కువ కాలం కొనసాగిన బిపర్‌జోయ్.. గుజరాత్‌ను తాకిన మూడో తుఫాన్

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుల్లో ఎక్కువ కాలం కొనసాగిన తుఫాన్‌గా బిపర్‌జోయ్ నిలిచింది. 1965 నుంచి గుజరాత్‌ను తాకిన తీఫాన్‌ల్లో బిపార్‌జోయ్ మూడోది.

Biparjoy longest cyclone in arabian sea

Cyclone Biparjoy : బిపర్‌జోయ్ తుఫాన్ డేంజర్ బెల్ మోగిస్తోంది. గుజరాత్ (Gujarat), మహారాష్ట్రాలకు అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉండగా, తెలంగాణ (Telangana)తోసహా మరో నాలుగు రాష్ట్రాలకు వర్షాలు ఆలస్యమయ్యే పరిస్థితి తీసుకువచ్చింది. ఇక ముంబై (Mumbai) మహానగరానికి తుఫాన్ వల్ల పెను ప్రమాదం ఉందని ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది వాతావరణశాఖ.

వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గుజరాత్‌లో తీరం దాటనున్న తుఫాన్.. పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలను నియంత్రిస్తోంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా విమానాలను రద్దు చేశారు. సుమారు 80 రైలు సర్వీసులను తుఫాన్ ఎఫెక్ట్‌తో రద్దు చేశారు.

పోర్‌బందర్‌కు పశ్చిమ నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన బిపపర్‌జోయ్ తుఫాన్ గురువారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో అతితీవ్రంగా ఉంటుందని.. అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గుజరాత్‌లోని మాండ్వి – పాకిస్థాన్‌లోని కరాచి మధ్య విస్తరించిన తుఫాన్ గుజరాత్‌లోని జఖౌ పోర్ట్ వద్ద తుఫాన్ తీరం తాకనుంది.

గుజరాత్‌ ప్రభుత్వం అలర్ట్
తుఫాన్‌పై గంటగంటకు తీవ్ర హెచ్చరికలు జారీ అవుతుండటంతో గుజరాత్‌ ప్రభుత్వం అలర్ట్ అయింది. తీరంలోని కచ్‌, పోర్‌బందర్‌, ద్వారక, జాంనగర్‌, జునాగఢ్‌, మోర్బి జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. సముద్ర తీరప్రాంత వాసులను, లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. ఇప్పటికే 10 వేల మందిని తరలించగా, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సముద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని సైతం షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది ప్రభుత్వం. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం, నౌకా, కోస్టుగార్డు దళాలతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉన్నారు.

అల్లకల్లోలంగా అరేబియా సముద్రం
తుఫాన్ ప్రభావం వల్ల అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రభుత్వ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్ బృందం.. ద్వారక తీరంలో ఓ ఆయిల్‌ రిగ్‌లో పనిచేస్తున్న 50 మంది కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎంతో సాహసోపేతంగా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది కోస్ట్‌గార్డ్‌. ఈ 50 మంది ద్వారకలోని ఓఖా తీరానికి 40 కిలోమీటర్ల దూరంలో కీ సింగపూర్‌ ఆయిల్‌ రిగ్‌లో పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి నిరంతర ఆపరేషన్‌ చేపట్టి మొత్తం 50 మంది సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

తీరం దాటే సమయంలో తీవ్ర విధ్వంసం
బిపార్‌జోయ్ తుపాను తీరం దాటే సమయంలో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రధాని మోదీ తుఫాన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిని సమీక్షించాలని సూచించారు ప్రధాని. బలమైన గాలుల కారణంగా ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలను దింపే పరిస్థితి లేక మరో ఎయిర్‌పోర్టుకు మళ్లిస్తున్నారు.

Also Read: తుపాన్ ముప్పు.. 8 రాష్ట్రాలు అలర్ట్, 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానుల్లో ఎక్కువ కాలం కొనసాగిన తుఫాన్‌గా బిపర్‌జోయ్ నిలిచింది. 1965 నుంచి గుజరాత్‌ను తాకిన తీఫాన్‌ల్లో బిపార్‌జోయ్ మూడోది. 1965 నుంచి ఇప్పటివరకు అరేబియా సముద్రంలో 13 తుపానులు ఏర్పడ్డాయి. వీటిలో రెండే గుజరాత్‌ తీరాన్ని దాటాయి. ఒకటి మహారాష్ట్రలో తీరాన్ని దాటింది. ఇంకొకటి పాకిస్థాన్‌ తీరాన్ని దాటింది. మరో 3 ఒమన్‌-యెమెన్‌ల వద్ద తీరాన్ని దాటాయి. మరో 6 బలహీనపడి సముద్రంలోనే ముగిశాయి. ఈ నెల 6న మొదలైన తుఫాన్… 15న తీరం దాటనుంది. ఇప్పటికే 8 రోజుల 12 గంటలు పూర్తి చేసుకున్న తుఫాన్ మరో రెండు రోజులు ప్రభావం చూపనుంది. 2019లో అరేబియాలో ఏర్పడిన క్యార్‌ తుఫాన్ 9 రోజుల 15 గంటలపాటు ప్రభావం చూపింది. 2018లో బంగాళాఖాతంలో ఏర్పడిన గాజా తుఫాన్ కూడా 9 రోజులు కొనసాగింది.

Also Read: ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తం.. గుజరాత్ తీరంలో ఆయిల్ రిగ్ వద్ద చిక్కుకుపోయిన 50 మంది సురక్షితంగా తరలింపు

వాతావరణశాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేసింది. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నందున స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సర్వీసులను.. సిబ్బందిని అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు