BJP breaks Yadiyurappa campaign amid court proceedings
BJP: కర్ణాటక రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించుకున్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం బ్రేకులు వేసింది. సొంతంగా ఎలాంటి పర్యటన చేయరాదని, ఏదైనా చేస్తే ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైతోనే చేయాలని ఆదేశించింది. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళినికుమార్ కటిల్ సారధ్యంలో జరిగే పార్టీ పర్యటనల్లో కూడా పాల్గొనవచ్చని సూచించింది.
2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని యడియూరప్ప నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తవడానికే వచ్చాయి. అయితే తాజాగా మనీ లాండరింగ్ కేసులో హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అధిష్టానం నిర్ణయాలు మారాయి. ఈ సమయంలో యడియూరప్పను ఎక్కడికి ఒంటరిగా పంపకూడదని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని యడియూరప్ప ప్రకటిస్తూనే ఉన్నారు. ఇందుకు అధిష్టానం వరుసగా బ్రేక్‌లు వేస్తూనే వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు రాష్ట్రంలోని మొత్తం 224 శాసనసభా నియోజకవర్గాల్లోనూ కలిపి మొత్తం మూడు బృందాలుగా అగ్రనేతలు పర్యటించాలని ఇటీవలి కోర్‌కమిటీలో ప్రస్తావన వచ్చింది.
ఒక బృందానికి సీఎం బొమ్మై నాయకత్వం వహించాలని మరో బృందానికి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళినికుమార్ కటిల్ సారధ్యం వహించాలని మూడో బృందానికి పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప నాయకత్వం వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి బొమ్మై, పార్టీ అధినేత కటిల్ పర్యటనలపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ యడియూరప్ప పర్యటనకు మాత్రం బ్రేకులు వేశారు. మూడు బృందాలను రెండుకు కుదిస్తూ అధిష్టానం సంకేతాలుపంపినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది.
Queen Elizabeth II Death: సెప్టెంబర్ 11న జతీయ సంతాపదినం ప్రకటించిన భారత్