గెట్ అవుట్…40మంది నాయకులపై బీజేపీ వేటు

త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న  ఉత్తరాఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ తన ఉత్తరాఖండ్ యూనిట్ నుండి 40 మంది సభ్యులను బహిష్కరించింది. బహిష్కరించబడిన సభ్యులలో రజనీష్ శర్మ, మీరా రాటూరి, మోహన్ సింగ్ బిష్ట్, మహేష్ బాగ్రి, ప్రమీలా యునియాల్, భవన్ సింగ్ తదితరులు ఉన్నారు.

 జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన సంస్థాగత కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అజయ్ భట్ ఈ చర్య తీసుకున్నారు. తమ పార్టీ పదవుల నుంచి వారిని తొలగించారు. ఉత్తరాఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 16 వరకు మూడు దశల్లో 12 జిల్లాల్లో జరగనున్నాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కున్వార్ ప్రణవ్ సింగ్ ఈ ఏడాది జూలైలో ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించబడిన విషయం తెలిసిందే. 

పార్టీ చట్టసభ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన “క్రమశిక్షణా సమావేశాలు” నిర్వహించిన నెల తరువాత ఈ చర్య కీలకంగా మరింది. బీజేపీ ప్రముఖుడు కైలాష్ విజయవర్గియా కుమారుడు, మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్ ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గియా క్రికెట్ బ్యాట్‌ తో ఒక అధికారిపై దాడి చేసిన తర్వాత ప్రధాని మోడీ క్రమశిక్షణా సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఎవరైనా, ఎవరి కొడుకు అయినా అలాంటి అహంకారం, దుష్ప్రవర్తనను సహించలేము, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని ఇండోర్ సంఘటనని ప్రస్తావిస్తూ చెప్పారు.