ADR Report : ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా బీజేపీకే అత్యధిక విరాళాలు

2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది.

Adr Report

ADR Report 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది. ఏడు ఎలక్ట్రోరల్‌ ట్రస్టులు ఈసీకి సమర్పించిన విరాళాల ఆధారంగా ఈ వివరాలను ఏడీఆర్‌ వెల్లడించింది. అయితే అన్ని పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో బీజేపీకే అత్యధికంగా 76.17 శాతం విరాళాలు వచ్చాయి.

ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా బీజేపీకి రూ.276.45 కోట్లు విరాళాలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి రూ.58 కోట్లు (మొత్తం విరాళాల్లో15.98శాతం) వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్‌ కాకుండా మరో 12 పార్టీలకు ఎలక్ట్రోరల్‌ ట్రస్టుల ద్వారా విరాళాలు అందాయి. ఆర్ఎల్డీ,ఆప్,ఎల్జేపీ,జేడీయూ,ఎస్పీ,ఎస్‌హెచ్‌ఎస్‌, యువ జన్‌ జాగృతి పార్టీ, జననాయక్‌ పార్టీ, జేఎంఎం,ఎస్‌ఏడీ, ఐఎన్‌ఎల్డీ, జేకేఎన్‌సీ పార్టీలకు మొత్తంగా 25.46 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయని ఏడీఆర్‌ తెలిపింది.

పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన జాబితాలో జేఎస్‌డబ్ల్యూ, అపోలో టైర్స్‌, ఇండియా బుల్స్‌, ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, డీఎల్‌ఎఫ్‌ గ్రూప్స్‌ ఉన్నట్లు ఏడీఆర్ తన రిపోర్ట్ లో పేర్కొంది. ఒక్క జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ అత్యధికంగా రూ.39.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. అపోలో టైర్స్‌ రూ.30 కోట్లు, ఇండియా బుల్స్‌ రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చాయి. ఇక,18 మంది వ్యక్తులు కూడా ఎలక్ట్రోరల్ ట్రస్టులకు విరాళాలు ఇచ్చారు. 10మంది…ప్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ కి రూ.2.87కోట్లు విరాళంగా ఇవ్వగా,స్మాల్ డొనేషన్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ కి నలుగురు వ్యక్తులు రూ. 5.50లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. స్వేదశీ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ కి నలుగురు వ్యక్తులు మొత్తంగా 1లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారని ఏడీఆర్ తెలిపింది.