అరుణ్ జైట్లీ జీవిత ప్రస్థానం

  • Publish Date - August 24, 2019 / 07:19 AM IST

గత దశాబ్ద కాలంలో దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో నవంబర్ 28, 1952న జన్మించారు. జైట్లీ తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ అప్పట్లోనే పెద్ద లాయర్‌గా పేరు గడించారు. ఢిల్లీలోనే డిగ్రీ, లా కోర్సు పూర్తి చేసిన అరుణ్ జైట్లీ విద్యార్ధి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి కనబరిచేవారు. అందుకే తగ్గట్లే స్టూడెంట్ లీడర్‌గా కూడా పని చేశారాయన. ఏబీవీపీ లీడర్‌గా పని చేసిన అరుణ్ జైట్లీ..ఎమెర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో గడిపారు. 

జైలు నుంచి విడుదలైన తర్వాత జన్‌ సంఘ్‌లో చేరారు. బీజేపీ తొలి తరం నేతలతో పాటు ద్వితీయతరం నేతలకు సన్నిహితంగా మెలిగే అవకాశం ఆయనకి లభించింది. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ సొలిసిటరల్ జనరల్‌గా పని చేశారు. 1991లో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్ విన్పించడంలో చురుకుగా వ్యవహరించారు జైట్లీ. 1998 తర్వాత జైట్లీ దేశ రాజకీయాల్లో ప్రముఖపాత్ర పోషించారు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో న్యాయశాఖా మంత్రిగా పని చేశారు. 2006లో రాజ్యసభ మెంబర్‌గా పార్టీ నామినేట్ చేయడంతో పెద్దల సభలో పార్టీ లైన్‌ని అందరికీ చేరువ చేయడంలో తనదైన ముద్ర వేశారు. 

2012లోనూ రాజ్యసభ మెంబర్‌గా ఎన్నికైనా…2014 ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేశారు. అమృత్‌సర్ నుంచి బరిలో దిగిన ఈయన ఓడిపోయినా మోదీ కేబినెట్‌లో చోటు దక్కింది. 2014 నుంచి 2019 వరకూ కేంద్ర ఆర్ధిక మంత్రిగా పని చేసిన జైట్లీ..2017లో సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో ఆమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుని వచ్చారు. అయినా..అనారోగ్యం తిరగబెట్టడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత మోదీతో తనని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని కూడా సూచించారు. అలా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన జైట్లీ కన్నుమూత బీజేపీకి తీరని లోటుగా చెబుతున్నారు.
Read More : అడ్డంగా దొరికింది : పిండి ముద్దను పాపాయిలా నమ్మించబోయి