×
Ad

కమల దళపతి వచ్చేస్తున్నాడు.. ముహూర్తం ఖరారు..

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం.

BJP President: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌ను ఎన్నుకునేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో భాగంగా జనవరి 15 తర్వాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ జనవరి 18-20 మధ్య పూర్తవుతుందని తెలుస్తోంది.

జనవరి 20 నాటికి నితిన్ నబీన్‌ను బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సగానికి మించి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఆయా రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ అభ్యర్థిత్వానికి మద్దతుగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. మరో సెట్ నామినేషన్ పత్రాలు బీజేపీ జాతీయ మండలి (పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత నిర్ణయ వేదిక) సభ్యుల ద్వారా దాఖలవుతాయి.

Also Read: ఛలో గావ్.. కాంగ్రెస్ ఊరిబాట.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు..

Nitin Nabin

నితిన్ నబీన్‌కు మద్దతుగా దాఖలయ్యే నామినేషన్ పత్రాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకాలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతకాలు ఉంటాయని జాతీయ మీడియా పేర్కొంది. నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థిగా ఉండొచ్చు. దీంతో బీజేపీ ప్రధాన ఎన్నికల అధికారి కె.లక్ష్మణ్ నామినేషన్ల పరిశీలన పూర్తిచేసిన వెంటనే ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా పదవీకాలం జనవరి 2026 నుంచి జనవరి 2029 వరకూ ఉండనుంది. 2029లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని ఆ ఏడాదికి మించి పొడిగించే అవకాశం ఉంది. 45 ఏళ్ల నితిన్ నబీన్‌ను జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ద్వారా యువ నాయకత్వాన్ని ముందుకు తెచ్చే దిశగా బీజేపీ దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోంది.