BJP vs Congress Showdown Over Pulwama Widows
Pulwama Widows Protest: రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోన్న పుల్వామా అమరుల భార్యల (వితంతువుల) నిరసన శనివారం నాటికి తీవ్ర స్థాయికి చేరింది. వీరి నిరసనకు విపక్ష భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తోంది. కాగా, శుక్రవారం బీజేపీ నేత కిరోది లాల్ మీనాను అరెస్ట్ చేయడంతో శనివారం రాష్ట్ర రాజధాని జైపూర్లో బీజేపీ నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పుల్వామా అమరుల భార్యలు చేస్తున్న నిరసనను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా, తాజా నిరసనలో రాజస్థాన్ విపక్ష ఉప నేత రాజేంద్ర రాథోడ్ సహా అనేక మంది బీజేపీ నేతలు అరెస్ట్ అయ్యారు.
నిరసన శనివారం తారా స్థాయికి చేరింది. నిరసనకారులు ముఖ్యమంత్రి గెహ్లాట్ ఇంటి వైపుకు ర్యాలీ తీశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో నిరసనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. పోలీసుల మీదకు నిరసనకారులు రాళ్లు విసిరారు. బారికేడ్లను ఎత్తేశారు. దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. 2019లో పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమర జవాన్ల భార్యలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ గెహ్లాట్ ప్రభుత్వాన్ని వారం రోజులుగా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
Oscar 2023 : ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ సందడి..
శుక్రవారం నిరసనకారులు జైపూరులోని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఇంటి ముందు నిరసన చేపట్టారు. కాగా వారిని వారి నివాస ప్రాంతాల సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర జవాన్ల భార్యలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ మండిపడ్డారు. అయితే పోలీసుల తీరుపై పైలట్ స్పందిస్తూ.. వితంతువుల సమస్యలను సున్నితంగా వినాలని అన్నారు. ‘‘రోడ్లు వేయడం, ఇళ్లు నిర్మించడం, విగ్రహాల ప్రతిష్ఠాపన వంటి డిమాండ్లను నెరవేర్చగలమని నేను నమ్ముతున్నాను. అమరవీరుల వితంతువుల డిమాండ్లను వినడానికి సిద్ధంగా లేమనే సందేశం వెళ్లకూడదు. వారి సమస్యలను మనం అంగీకరిస్తున్నామా లేదా అనేది వేరే విషయం, కానీ వారి డిమాండ్లను వినే సమయంలో ఎవరైనా తన అహాన్ని పక్కన పెట్టాలి’’ అని ముఖ్యమంత్రి గెహ్లాట్ పేరు ఎత్తకుండా పైలట్ విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు
ఫిబ్రవరి 28 నుంచి పుల్వామా వితంతువులు నిరసన చేస్తున్నారు. పిల్లలే కాకుండా వారి బంధువులు కూడా కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేలా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, అమరవీరుల విగ్రహాల ఏర్పాటు తదితర డిమాండ్లు కూడా ఉన్నాయని వారు అంటున్నారు.