Bombay High Court: జైలులో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
ఏడు వారాల జైలు జీవితంలోనే బాధితుడు ఏకంగా 21 కిలోల బరువు తగ్గడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడాన్ని కోర్టు(Bombay High Court) తీవ్రంగా పరిగణించింది.
Bombay High Court granted medical bail to a prisoner lost 21 kg in seven weeks
- ఖైదీకి వైద్య బెయిల్ మంజూరు
- ఏడు వారాల్లో బరువు తగ్గాడు
- బాంబే హైకోర్టు కీలక నిర్ణయం
Bombay High Court: క్రిమినల్ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ కేసులో అరెస్టయిన 59 ఏళ్ల రాధా మోహన్ మిశ్రాకు బాంబే హైకోర్టు అంతంతమాత్రంగా ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది. కేవలం ఏడు వారాల జైలు జీవితంలోనే బాధితుడు ఏకంగా 21 కిలోల బరువు తగ్గడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడాన్ని కోర్టు(Bombay High Court) తీవ్రంగా పరిగణించింది. జస్టిస్ మిలింద్ జాధవ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, ఖైదీ ఆరోగ్య పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉందని స్పష్టం చేస్తూ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
జైలు వాతావరణంలో క్షీణించిన ఆరోగ్యం.. కస్టడీలో స్పృహ తప్పిన నిందితుడు:
గతంలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ శస్త్రచికిత్స చేయించుకున్న మిశ్రా, జైలులో నిర్దేశిత ద్రవాహారం లభించక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కస్టడీలో ఉండగా నిరంతర వాంతులు, తలతిరగడం, డీహైడ్రేషన్, తీవ్ర అలసట వంటి సమస్యలు తలెత్తాయని కోర్టు గుర్తించింది. జైలు ఆసుపత్రిలోని పరిమిత వైద్య వసతుల వల్ల నిందితుడి ఆరోగ్యం తిరిగి కోలుకోలేని స్థాయికి దిగజారే ప్రమాదముందని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
‘బెయిల్ నిబంధన.. జైలు మినహాయింపు’.. ప్రాసిక్యూషన్ వాదన తోసిపుచ్చిన కోర్టు:
జైలులోనే వైద్యం అందించవచ్చన్న ప్రాసిక్యూషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. చట్టంలో వైద్య బెయిల్ దుర్వినియోగమయ్యే అవకాశాలున్నప్పటికీ, “బెయిల్ నిబంధన.. జైలు మినహాయింపు” అనే సార్వత్రిక సూత్రాన్ని ఇక్కడ పాటించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. నిందితుడికి తక్షణమే స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణ, సురక్షితమైన ఆహారంతో కూడిన పునరావాసం అత్యవసరమని అభిప్రాయపడుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
