Drone Pak
Open Fire At Drone : జమ్ము కశ్మీర్ లో డ్రోన్ల కలకలం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇలా డ్రోన్లు ప్రత్యక్షం కావడం కామన్ అయిపోయింది. దీంతో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
తాజాగా..జమ్ము నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద 2021, జూలై 02వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఓ డ్రోన్ కనిపించింది. సరిహద్దులోని ఫెన్సింగ్ కు పాక్ వైపు ఈ డ్రోన్ ఉన్నట్లు భారత బలగాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల ధాటికి ఆ డ్రోన్ తిరిగి పాక్ వైపు వెళ్లింది. ఈ డ్రోన్ తో పరిసర ప్రాంతాల ఫొటోలు తీసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జమ్ములో తరచూ డ్రోన్లు ప్రత్యక్షం కావడం కలవర పెడుతోంది. ఇలా డ్రోన్లు కనిపించడం ఐదోసారి. ఇటీవలే జమ్ములో వైమానిక కేంద్రం వద్ద 7 డ్రోన్లు లభించాయి. వైమానిక కేంద్రాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.