Video: భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన వందలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో చివరకు బంగ్లాదేశ్ ప్రధాని హసీనా గద్దెదిగాల్సి వచ్చింది. హింస వల్ల బంగ్లాదేశ్ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. సరిహద్దులు దాటి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

సొంత దేశంలో తమకు భద్రత లేదని వారు భావిస్తున్నారు. వారిని ఇండియాలోకి ప్రవేశించకుండా భారత సరిహద్దు భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద నుంచి వందలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు బుధవారం భారత్ లోకి చొరబడాలని చూడగా వారిని బీఎస్ఎఫ్ అడ్డుకుని, వెనక్కి పంపించింది.

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ ప్రజలు భారత్ లోకి రాలేకపోయారని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. ఝపోర్టలా సరిహద్దు ఔట్‌పోస్ట్ ప్రాంతంలోని దక్షిణ్ బెరుబరి గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ ప్రజలు గుమిగూడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నాయి.

తమను భారత్‌లోకి రానివ్వాలని వారు మన జవాన్లను వేడుకున్నారు. తాము అనుభవిస్తున్న భయానక పరిస్థితుల గురించి చెప్పుకున్నారు. అయితే, తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని బీఎస్ఎఫ్ జవాన్లు వారికి చెప్పి పంపారు.

Also Read: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న యూనస్

ట్రెండింగ్ వార్తలు