భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పునర్వైభవాన్ని తెచ్చుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత వైఫై, ఎక్కువసేపు మాట్లాడితే తిరిగి మేమే చెల్లిస్తామని వినియోగదారులకు చెబుతుంది. ఈ మేరకు ఢిల్లీ బ్రాంచుకు చెందిన సంస్థ సీఎఫ్‌ఏ (కన్జ్యూమర్ ఫిక్స్‌డ్ యాక్సిస్) ఎండీ వివేక్ బాంజల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు నెల పాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్, వైఫై సేవలు అందిస్తామన్నారు.
ల్యాండ్ లైన్ వినియోగదారులు 5 నిమిషాలకు పైబడి అవుట్‌గోయింగ్ కాల్ మాట్లాడితే ఎదురుగా 6 పైసలు చెల్లిస్తాం. ఇలా అపరిమితంగా చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌లో నెల రోజుల పాటు 10mbps స్పీడ్‌తో రోజుకు 5gb వరకు ఉచితంగా ఇంటర్‌నెట్ వినియోగించుకోవచ్చు. ఆ తరువాత కనీస ప్లాన్ నెలకి రూ.349 (రోజుకి 2gb, 8mbps స్పీడ్) నుంచి మొదలవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఫైబర్ కనెక్టివిటీతో కేబుల్, ఇతర డేటా సేవలందించే సంస్థల భాగస్వామ్యంతో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్, హోం వైఫై కనెక్షన్లు అందిస్తున్నామని, తొలి ప్రయత్నంగా విశాఖపట్నంలో వీటిని ప్రారంభించామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా సంస్థకు లక్షా 60 వేల మంది, రాష్ట్రంలో 9 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 50 శాతం మంది ఉద్యోగులు వీఆర్‌ఎస్ ప్యాకేజీ ద్వారా పదవీవిరమణ పొందే అవకాశముంది.