పెద్ద తప్పు జరిగిపోయింది : మన క్షిపణితో.. మన యుద్ధ హెలికాప్టర్‌ను కూల్చేసుకున్నాం

  • Publish Date - October 4, 2019 / 10:04 AM IST

దేశీయ బుద్గాం Mi-17 హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన జరిగి నెలలు గడుస్తున్నాయి. ఫిబ్రవరి 27న భారత వైమానిక దళం పాకిస్థాన్ వైమానిక దళంతో జరిపిన డాగ్ ఫైట్‌ ఆపరేషన్‌లో మన దేశీయ మిస్సైల్.. సొంత యుద్ధ Mi-17 హెలికాప్టర్ ను పేల్చేసింది. ఈ ఘటనపై కోర్టు విచారణ అనంతరం ఐఏఎఫ్ చీఫ్ రాకేశ్ కుమార్ భాదౌరియా స్పందించారు. పెద్ద తప్పు  జరిగిపోయిందని అన్నారు.

శుక్రవారం (అక్టోబర్ 4, 2019) మీడియాతో  ఆయన మాట్లాడుతూ.. ‘కోర్టు విచారణ పూర్తి అయింది. దేశీయ క్షిపణి… వైమానిక దళంలోని మన సొంత హెలికాప్టర్‌ను ఢీకొట్టడం పెద్ద తప్పు. దీనికి కారణమైన ఇద్దరి అధికారులపై చర్యలు తీసుకున్నాం. ఇదొక పెద్ద తప్పుగా మేం అంగీకరిస్తున్నాం. ఇలాంటి  తప్పు.. భవిష్యత్తులో మరోసారి జరగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం’ అని అన్నారు.

రాఫెల్, S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ భారత వైమానిక దళాన్ని మరింత పటిష్టం చేస్తోందని ఐఏఎఫ్ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. స్పైడర్ వైమానిక రక్షణ క్షిపణి బుద్గాంలో Mi-17 హెలికాప్టర్‌ను ఢీకొట్టడంతో ఆరుగురు ఐఏఎఫ్ సిబ్బంది మృతిచెందారు. ఇటీవలే ఈ ఘటనపై ఐఏఎఫ్ కోర్టు విచారించింది. ఇందులో ఐదుగురు అధికారులను దోషులుగా గుర్తించారు.

పాకిస్థాన్ లోని బాల్ కోట్ దగ్గర ఐఏఎఫ్ జెట్స్ వైమానిక దాడులు చేసి జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను పేల్చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇండియా వైపుగా దూసుకొచ్చిన పాక్ జెట్ విమానాలపై ప్రతిదాడి చేసిన సమయంలో దేశీయ ఎంఐ-17 హెలికాప్టర్‌ను ఇండియన్ మిస్సైల్ ఢీకొట్టడంతో కూలిపోయింది.