ఇవాళ(ఫిబ్రవరి-1) తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ పైనే దేశ ప్రజలందరి కళ్లు ఉన్నాయి. బడ్జెట్ లో ఏయే సెక్టార్లకు ఏయే రాయితీలు ఉంటాయోనని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న సందర్భంలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ కావడంతో బడ్జెట్ ఎప్పుడెప్పుడు ప్రవేశపెడతారా అని అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు ఎదురుచూస్తున్నాయి. ఈ బడ్జెట్ లో ఎట్టిపరిస్థితుల్లో రాయితీలు కల్పించే విషయంలో వెనక్కు తగ్గకూడదని మోడీ సర్కార్ భావిస్తోంది. బడ్జెట్ సమావేశాల కంటే ముందే విద్యా, ఉద్యోగాల్లో అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు వంటి నిర్ణయాలతో మధ్యతరగతిని ఆకట్టుకొన్న మోడీ సర్కార్ ఇప్పుడు బడ్జెట్ ద్వారా సన్నకారు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి వారికి, సీనియర్ సిటిజన్స్ కి మరిన్ని రాయితీలు కల్పించేందుకు రెడీ అయింది.
రైతులకు వరాలు:
నాలుగున్నరేళ్లుగా రైతుల కోసం ఎన్ని పథకాలు చేపట్టినప్పటికీ అవన్నీ దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కల్పించే నిర్ణయాలు కావడంతో రైతుల్లో మోడీ సర్కార్ పట్ల కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పక తప్పదు. రైతులకు మధ్యంతర బడ్జెట్ లో వరాలు ప్రకటించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ రెడీ అయింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ స్కీమ్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. తెలంగాణ తరహాలో రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎకరాకి 4వేల రూపాయల రూపాయల చొప్పున ఏడాదికి 10 వేల రూపాయలను రైతు ఖాతాల్లో నేరుగా నగదు, ప్రతి సీజన్ లో లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు రెడీ అయింది. 2028 లక్షల కోట్లతో రైతులపై వరాల జల్లు కురిపించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. అంతేకాకుండా పేద రైతుల కోసం కనీస గ్యారెంటీ స్కీమ్ ని ప్రవేశపెట్టి భూమి లేని రైతులను కూడా సంతృప్తి పర్చాలని భావిస్తోంది. పండిన పంటకు మంచి ధర, ప్రాసెసింగ్ కు, మార్కెట్లకు టెక్నాలజీని లింక్ చేయడం వంటి బడ్జెట్ సమయంలో ప్రకటన చేయబడే అవకాశం ఉంది.
మధ్యతరగతికి, మహిళలకు, సీనియర్ సిటిజన్ లకు:
పేదలకన్నా దేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువకాబట్టి వారికి బడ్జెట్ లో పెద్ద పీట వేసే అవకాశముంది. ఉద్యోగస్థులకు ట్యాక్స్ మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2.5 లక్షల నుంచి 3లక్షలకు పెంచడం, 60 నుంచి 80 ఏళ్ల వయస్సున్న సీనియర్ సిటిజన్ లకు 3.5 లక్షలకు ట్యాక్స్ మినహాయింపు పరిమితి పెంచడం, 80 ఏళ్లు పైబడిన వారికి 5 నుంచి 5.5 లక్షలకు పెంచేందుకు మోడీ సర్కార్ రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే 10 శాతం రిజర్వేషన్ల నిర్ణయంతో మధ్యతరగతివారిని మోడీ తన వైపు తిప్పుకోవడంలో కొంత సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగస్థులను బడ్జెట్ ద్వారా ఆకట్టుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. వర్కింగ్ మహిళలకు కూడా ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి బడ్జెట్ లో మనిహాయింపుల పరిమితిని పెంచేందుకు రెడీ అయింది.పిల్లల ట్యూషన్ ఫీజులు, హౌసింగ్ లోన్ రీపేమెంట్ వంటి వివిధ రకాల చెల్లింపులు, పెట్టుబడులకు సంబంధించి సెక్షన్ 80C మినహాయింపులు అందిస్తోంది. అయితే పన్ను తగ్గింపు పరిమితిని 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు తగ్గించాలని భావిస్తోంది. 40వేల రూపాయల ప్రామాణిక మినహాయింపు పరిమితిలో పెంపుని 70 వేయాలకు చేయాలనుకుంటోంది.కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారికి మొదటి ఏడాది 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఈ రాయితీని 3 లక్షల రూపాయలకు పెంచాలని ఆర్థిక శాఖ ఆలోచిస్తోంది.
సన్నకారు వ్యాపారులకు:
ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సన్నకారు వ్యాపారులను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని, బడ్జెట్ లో వీరికి భారీ రాయితీలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకం పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రభావం టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్స్ పై పడనుంది. దేశంలో ప్రతి ఏటా 50 లక్షల టీవీలు అమ్మకాలు జరుగుతుంటే.. అందులో 49 లక్షల టీవీలు దిగుమతి చేసుకునేవే. ప్రస్తుతం పెంచిన దిగుమతి సుంకంతో ఈ ధరలు పెరగనున్నాయి. ఈ దిగుమతి పన్నును తగ్గించాలని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయినెన్స్ మ్యానిఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) డిమాండ్ చేస్తోంది. గత ఏడాది 19 ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై దిగుమతి పన్ను 20శాతానికి చేరిందన్నారు. దీంతో ఈ బడ్జెట్ లో పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశముంది. మేకిన్ ఇండియాను ప్రమోట్ చేసే దానిలో భాగంగా దేశీయ వ్యాపారాలను మరితం వేగంగా పరుగులు తీయించాలంటే కొన్ని రాయితీలు తప్పనిసరి అని ప్రభుత్వం ఆలోచిస్తోంది.