ఘోర బస్సు ప్రమాదం, 38మంది జలసమాధి

Bus falls into canal in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38మంది చనిపోయారు. అధికారులు ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. మిగతా వాళ్లు గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మంగళవారం(ఫిబ్రవరి 16,2021) ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం వేగంగా నడుపుతూ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. వంతెనపై నుంచి పడిన తర్వాత బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కాల్వలో ప్రవాహానికి బస్సు కొంతదూరం కొట్టుకుపోయింది.

బస్సులో 60మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ బస్సు సిధి నుంచి సత్నాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి వాటిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు.

ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాల్వలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో ఎగువన బన్‌సాగర్ డామ్ నుంచి నీటి విడుదలను నిలిపివేయాలని అధికారులకు సూచించారు.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో జరిగే హౌస్‌ వార్మింగ్‌ వేడుకలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్‌ షా హాజరు కావాల్సి ఉండగా, రద్దు చేసుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఎవై) పథకం కింద మధ్యప్రదేశ్‌లో లక్షకుపైగా ఇళ్లను నిర్మించారు. ఈ కార్యక్రమానికి అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొనాల్సి ఉంది. ప్రమాదంపై అమిత్‌ షా ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారంతా స్థానిక గ్రామాల ప్రజలు. ఈ ఘటన తీరని విషాదం నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు