Amarinder Singh : G-23 కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్న కెప్టెన్ సాబ్.. అందుకేనా?

పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ రెబల్ G-23 కాంగ్రెస్ నేతలను కలువనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..

Captain Amarinder Singh meet G-23 leaders : పంజాబ్‌ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం రోజురోజుకీ మరింత ముదురుతోంది. పంజాబ్‌ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని రోజుల తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ రెబల్ G-23 కాంగ్రెస్ నేతలను కలువనున్నట్టు కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం ఢిల్లీకి వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరతారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై G-23 రెబల్ నేతల్లో ఒకరైన సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంపై సిబల్ సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు.
Punjab Politics : పంజాబ్ పీసీసీ చీఫ్ గా లాల్ సింగ్!

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా అనంతరం పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మధ్య కపిల్ సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ఎన్నికైన అధ్యక్షుడు ఎవరూ లేరని చెప్పారు. అందువల్ల నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని స్పష్టం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తోందని చెప్పారు. పార్టీ ఉండకూడని పరిస్థితిలో ఉందన్నారు. G-23 రెబల్ నేతల్లో కపిల్ సిబల్ తో పాటు మరొక కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కూడా పార్టీలో ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెబల్ నేతలు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. రోజురోజుకూ పడిపోతున్న కాంగ్రెస్‌ ప్రతిష్టను కాపాడేందుకు అంతర్గత చర్చ అవసరమని లేఖలో పేర్కొన్నారు.

జీ-23 పేరుతో వ్యవహరిస్తున్న 23 మంది కాంగ్రెస్‌ నేతలు పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. పార్టీని బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తున్నారని సిబల్‌ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదని హితవు పలికారు. పార్టీలో సమస్యల పరిష్కారానికి అంతర్గత చర్చలు అవసరమని మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యల్ని కపిల్‌ సిబల్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు, వర్కింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని గతేడాదిలో సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో కపిల్‌ సిబల్‌ కూడా ఉన్నారు. ఇదిలా ఉంగా.. సిద్ధూ అత్యున్నత పదవికి ఎంపికైన 72 రోజుల క్రితమే పదవికి రాజీనామా చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధుతో విభేదాల కారణంగా సెప్టెంబర్ 18న కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరంజిత్ సింగ్ చన్నీ బాధ్యతలు చేపట్టారు.
Kapil Sibal : కాంగ్రెస్ లో అధ్యక్షుడే లేరు..పంజాబ్ పరిణమాలు పాక్ కి లాభం..సోనియాకి ఆజాద్ లేఖ

ట్రెండింగ్ వార్తలు