పౌరసత్వ సవరణం : పోలీసులను తరిమి తరిమి కొట్టారు

  • Publish Date - December 20, 2019 / 02:16 AM IST

పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనాలు సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమౌతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు.

అడ్డుకోబోయిన పోలీసులపైనే తిరగబడ్డారు..రాళ్లు రువ్వుతూ విచ్చలవిడిగా విధ్వంసం సృష్టించారు. మధ్యలో కొంతమంది వద్దు వద్దంటున్నా వినకుండా దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ్నుంచి పోలీసులే పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీస్ వాహనాలనూ వదిలి  పెట్టకుండా వెంటబడ్డారు..అల్లర్లను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులను పరిగెత్తించారు. జీపులలో ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోతోన్న పోలీసులపై రాళ్లు వేస్తూ తమ కసి తీర్చుకున్నారు.  

 

* పౌరసత్వసవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో వివిధ వర్గాలు ఆందోళనకు దిగాయి.
* సమాజ్ వాదీ పార్టీ ఈ నిరసనలకు మద్దతు పలికింది. ఈ క్రమంలో లక్నో, సంభాల్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి. 
* ఆందోళనకారులు పలు చోట్ల  వాహనాలను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
* దేశరాజధాని ఢిల్లీలో నిరసనల హోరు ఆకాశాన్నంటుతోంది.
 

* సీలంపూర్, జఫ్రాబాద్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోగా.. అవి ఎర్రకోట వరకూ  విస్తరించాయి.
* కేరళలో DYFI కార్యకర్తలు గవర్నర్ నివాసం వరకు ప్రదర్శన నిర్వహించారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగిస్తూ..ముందుకు దూసుకెళ్లారు. పోలీసులు వాటర్ ఫైరింగ్‌తో చెదరగొట్టే ప్రయత్నం చేశారు. 
* వెస్ట్ బెంగాల్‌లో వామపక్ష కూటిమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేంద్ర సర్కార్‌కు దమ్ముంటే..నూతన చట్టంపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి..ఫలితం వ్యతిరేకంగా వస్తే..అధికారం నుంచి వైదొలగాలని సీఎం మమంత డిమాండ్ చేశారు.