నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ.. ఎఫ్ఐఆర్ నమోదు

NEET: అసలు నీట్ ఏర్పాటే పెద్ద కాంట్రవర్సీ. ఒక్కో స్టేట్‌లో ఒక్కో సిలబస్ ఉండటం..

దేశంలో సంచలనం రేపుతున్న నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ జరపనుంది. ఇవాళ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. MBBSతో పాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌ పరీక్షపై దుమారం కొనసాగుతోంది. నీట్‌ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నీట్ యూజీ 2024లో 15 వందల 63 మంది అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దుచేసి, వారికి మళ్లీ పరీక్ష నిర్వహించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఏంటీ ఈ వివాదాలు?
నీట్ యూజీ పరీక్ష చుట్టూ ప్రతి ఏడాది వివాదం కంటిన్యూ అవుతోంది. అసలు నీట్ ఏర్పాటే పెద్ద కాంట్రవర్సీ. ఒక్కో స్టేట్‌లో ఒక్కో సిలబస్ ఉండటం.. నీట్‌ను మాత్రం ఒకే సిలబస్‌తో నిర్వహిస్తామనడంతో పాటు.. వివిధ కారణాలతో రాష్ట్రాలు నీట్‌ నిర్వహించేందుకు ఒప్పుకోలేదు.

గుజరాత్, మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, తెలంగాణ, కేరళతో పాటు పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో నీట్‌ను అమలు చేయడం లేదు. నీట్‌లో MBBS, BDSతో పాటు మరికొన్ని కోర్సులు మాత్రమే ఉన్నాయి. నర్సింగ్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరఫీ, ఫార్మసీ, సైకాలజీ, బయోమెడికల్ సైన్స్ కోర్సులు నీట్‌లో భాగంగా లేకుండా మార్పులు చేయడంతో కొన్ని రాష్ట్రాలు నీట్‌ నిర్వహణకు ఒప్పుకున్నాయి. 2016లో నీట్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం.

ఆ తర్వాతి ఏడాది 2017లో నీట్‌ పేపర్‌ లీక్ అయిందంటూ దుమారం లేచింది. పరీక్షకు ముందే నీట్ పేపర్‌ను లీక్‌ చేశారని అప్పట్లో వివాదాస్పదం అయింది. అప్పటికి అతి తక్కువ రాష్ట్రాలు నీట్‌ను అమలు చేస్తుండటంతో పెద్దగా ఇష్యూ కాలేదు. ఇప్పుడు దేశంలోనే మెజార్టీ రాష్ట్రాలు నీట్‌ను అమలు చేస్తుండటంతో..దాదాపు 24లక్షల మంది ఎగ్జామ్‌ రాయడంతో ఇష్యూ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. జాతీయస్థాయి ఎగ్జామ్‌ కావడం.. కేవలం కొన్ని సెంటర్లలో పరీక్ష నిర్వహణలో సమస్యలు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది?
ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్ష వ్యవహారం పెద్ద దుమారం లేపుతోంది. ఇప్పటికే నీట్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటిని జులై 8న లిస్ట్ ఔట్ చేయనుంది. అన్నింటిని కలిపి విచారణ జరిపి నీట్ రద్దుపై సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించనుంది. ఇప్పటికే నీట్‌ను రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పిన సుప్రీం.. లేటెస్ట్‌గా దాఖలైన పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందోనేది ఆసక్తికరంగా మారింది.

అయితే గ్రేస్ మార్కులు కలిపినవారిలో 67మందికి టాప్ ర్యాంకులు రావడంతో ఇష్యూ పెద్దగా మారింది. దీంతో 1,563 మందికి గ్రేస్ మార్కులను ఎత్తేసింది NTA. గ్రేస్ మార్కులు తీసేసిన వారికి రెండు ఆప్షన్లు ఇచ్చింది. తిరిగి ఎగ్జామ్ రాయొచ్చు. లేకపోతే గ్రేస్ మార్కులు తీసేసిన తర్వాత వచ్చిన మార్కులతోనే కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23న పరీక్షలు నిర్వహించి.. ఈ నెల జూన్ 30న ఫలితాలు ప్రకటించనుంది. దీంతో ఇప్పటికే నిర్ణయించిన దాని ప్రకారం జులై 6న కౌన్సెలింగ్ యథావిధిగా జరుగనుంది.

సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతుండగానే నీట్ అభ్యర్థుల ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నీట్‌ను రద్దు చేసి తిరిగి ఎగ్జామ్‌ నిర్వహించాలనే దానిపై పట్టుబడుతున్నారు స్టూడెంట్స్. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేదని..ప్రతీ ఏడాది నిర్వహించినట్లే ఈసారి ఎగ్జామ్ ఆర్గనైజ్ చేశామని చెప్తోంది. పదిరోజుల ముందు ఫలితాలు ప్రకటించడపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఉద్దేశం తప్ప..ఎలాంటి మిస్టేక్స్ జరగలేదని వాదిస్తోంది.

నీట్‌ పరీక్ష వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీట్ కుంభకోణం వ్యాపమ్ 2.O కంటే పెద్దదని ఆరోపిస్తున్నారు. గత పదేళ్లలో పేపర్‌ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును మోదీ నాశనం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గే.

నీట్‌లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్‌, పేపర్‌ లీక్‌ అయిందని, పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. నీట్‌ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే అంటున్నారు. పేపర్ లీక్ జరగలేదన్న కేంద్రం వివరణకు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. నీట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగకపోతే 13మందిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు ఖర్గే.

మరోవైపు నీట్ అభ్యర్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను కలిశారు. నీట్‌ పరీక్షలో జరిగిన మిస్టేక్స్‌తో పాటు ర్యాంకుల కేటాయింపు, గ్రేడ్ మార్క్స్‌పై కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నీట్‌ యూజీ పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీక్‌ అయిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్రప్రభుత్వం ఖండించింది. పేపర్‌ లీక్‌గానీ, రిగ్గింగ్‌ గానీ జరగలేదంటున్నారు కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంధ్ర ప్రధాన్.

కేంద్రం వివాదం ఎలా ఉన్నా.. ప్రతిపక్షాల విమర్శలు..నీట్ అభ్యర్థుల ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నీట్ ఇష్యూపై వాస్తవాలను తేల్చి..మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని..నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకు అసలు నీట్ ఎగ్జామ్ నిర్వహించే అర్హత లేదంటున్నారు స్టూడెంట్స్.

Also Read: పరిపాలన, ప్రజాసేవపై బాబు, పవన్ ఫోకస్.. ఏం చేస్తున్నారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు