Madras High Ec
Madras High Court Comments : మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. కరోనా పెరుగుదలకు ఈసీనే కారణమంటూ…ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో అభ్యంతరం తెలుపుతూ ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఆన్ రికార్డులో లేని వ్యాఖ్యలను మీడియా ప్రచురించకుండా ఉండాల్సిందని ఈసీ పిటిషన్‌లో పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయాయని ఈసీ వివరించింది.
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కేంద్ర ఎన్నికల సంఘానిదే ఏకైక బాధ్యత అని సోమవారం(ఏప్రిల్ 26, 2021)మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని వ్యాఖ్యానించింది. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా కరోనా నిబంధనలు అమలు చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని హైకోర్టు అభిప్రాయపడింది.
తమిళనాడులోని కరూర్ నియోజకవర్గం పోలింగ్ సందర్భంగా కరోనా నియమాలు పాటించేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌పై సోమవారం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెనర్జీ, జస్టిస్ సెంటిల్‌కుమార్ రామమూర్తితో కూడిన తొలి ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ఈసీనే ప్రధాన కారణమని హైకోర్టు మండిపడింది.
ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు మరో గ్రహంలో ఉన్నారా? అని ఈసీ తరుఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రచారాల సందర్భంగా మాస్కులు, శానిటైజర్లను వినియోగించకపోవడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడాన్ని కోర్టు గమనించిందని పేర్కొంది.
మే 2న ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలపై ఈసీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఈ నెల 30లోగా కోర్టుకు సమర్పించాలని.. విపలమైతే మే 2న ఓటింగ్ కౌంటింగ్‌ను నిలిపివేస్తామని ఈసీని మద్రాస్ హైకోర్టు హెచ్చరించింది. ప్రజల ప్రాణాలు, సంరక్షణ తర్వాతే ఏదైనా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.