రేపు భేటీ కానున్న కేంద్ర కేబినెట్

  • Publish Date - May 19, 2020 / 12:59 PM IST

లాక్ డౌన్ 4.0 అమలు, ఆర్ధిక ప్యాకేజి  పై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం మే,20, ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రధాన మంత్రి  నరేంద్రమోడీ నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ పరిస్థితులను, కరోనా వ్యాప్తిలో పెరుగుతున్న కేసులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. 

గత వారం ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించిన ఆత్మనిర్భర భారత్  ప్యాకేజీపై వస్తున్న ఫీడ్ బ్యాక్‌పై కూడా ఈ కేబినెట్ సమావేశంలో ప్రముఖంగా చర్చించనున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీవల్ల రాష్ట్రాలకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు విమర్శించటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 

గత రెండు నెలలుగా కరోనా వైరస్ దేశాన్ని కుదిపివేస్తోంది. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ నానాటికీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో వైపు వలస కార్మికుల కోసం ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేసినా…..ఎక్కువమంది కాలిబాటన సొంతూళ్లకు బయలు దేరటం విమర్శలకు తావిస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ  నిర్ణయం తీసుకున్నా  రోడ్డు రవాణా తో సహ పలు అంశాలకు సడలింపులు ఇచ్చింది. అయితే రైళ్లు, డొమెస్టిక్ విమానాలు నడిపే విషయంలో రేపటి కేబినెట్ లో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.