అతి తీవ్ర తుఫాన్ గా తీరం వైపు దూసుకొస్తోంది ఫొని తుఫాన్. ఏపీ – ఒరిస్సా రాష్ట్రాల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా రాష్ట్రాలతోపాటు సైన్యాన్ని కూడా అప్రమత్తం చేసింది కేంద్రం.
ఇందులో భాగంగా ప్రకృతి విపత్తు నిధుల కింద ముందస్తుగానే ఏపీకి రూ.200 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల వేళ ఫొని తుఫాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో.. ఏపీతో పాటు తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలైన ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) నుంచి రూ.1,086 కోట్లు విడుదల చేసింది.
వీటిలో ఏపీకి రూ.200 కోట్లు, ఒడిశాకు రూ.340 కోట్లు, తమినాడుకు రూ.309 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.235 కోట్ల నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తుపాన్ ముంచుకొస్తున్న దృష్ట్యా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని నాలుగు రాష్ట్రాలను ఆదేశించింది.