Mahua Moitra Vs Jai Anant: ఆ ఒక్క కుక్క కోసం కోర్టుకెక్కిన ఎంపీ.. ‘ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోలేరా?’ అంటూ హైకోర్టు సీరియస్..

మహువా మోయిత్రా, జై అనంత్ దేహద్రాయ్ విడిపోయిన తర్వాత హెన్రీ కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

Mahua Moitra Vs Jai Anant: ఆ ఒక్క కుక్క కోసం కోర్టుకెక్కిన ఎంపీ.. ‘ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోలేరా?’ అంటూ హైకోర్టు సీరియస్..

Updated On : September 5, 2025 / 2:21 PM IST

Mahua Moitra Vs Jai Anant: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, ఆమె మాజీ ప్రియుడు, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ తమ పెంపుడు కుక్క కోసం ఒకరిపై ఒకరు పోరాటం చేస్తున్నారు.

వారి పెంపుడు కుక్క పేరు ‘హెన్రీ’. దాని సంరక్షణ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వింత కేసుపై ఢిల్లీ హైకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా 2025 జనవరిలో ఢిల్లీ సాకేత్ జిల్లా కోర్టులో సివిల్ సూట్ వేశారు. కుక్కపై సంయుక్త సంరక్షణ కోరారు.

అయితే, జై అనంత్ దేహద్రాయ్ 2021లో ఆ కుక్కను కొనుగోలు చేశానని అంటున్నారు. ఆ కుక్కకు 40 రోజుల వయస్సు ఉన్నప్పటినుంచి తాను దాన్ని చూసుకుంటున్నానని చెబుతున్నారు.

ఆ కుక్క సంరక్షణ బాధ్యతను మోయిత్రాకు కూడా అప్పగించాలంటూ ఆమె చేస్తున్న వాదన విచిత్రంగా ఉందని దేహద్రాయ్ అంటున్నారు. దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి.

అసలు కోర్టులో ఏం జరిగింది?

ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహువా మోయిత్రా, జై అనంత్ దేహద్రాయ్ కలిసి కూర్చొని మాట్లాడుకుని పెంపుడు కుక్క సంరక్షణపై తలెత్తిన వివాదాన్ని ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.

“ఎందుకు కలిసి కూర్చొని పరిష్కరించుకోవడం లేదు? ఆమె సూట్‌లో ఏ ఉపశమనం కోరుతున్నారు?” అని న్యాయమూర్తి జైన్ ప్రశ్నించారు.

మహువా మోయిత్రా, జై అనంత్ దేహద్రాయ్ విడిపోయిన తర్వాత హెన్రీ కోసం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ కుక్క కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. హైకోర్టు ఈ కేసు విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది. అప్పటిలోగా ఇద్దరూ ఒక అవగాహనకు వస్తారో, లేక ఈ కుక్క కస్టడీ కేసు మరిన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

హెన్రీ ఎవరిది? ఇద్దరి వాదనలు ఇవే..

ఈ కేసులో ఇద్దరి వాదనలు బలంగా ఉన్నాయి. మహువా మొయిత్రా వాదన ఏంటంటే.. హెన్రీ తన పెంపుడు కుక్క అని, దానిపై తనకు పూర్తి హక్కు ఉందని అంటున్నారు. ప్రస్తుతం దేహద్రాయ్ వద్ద అది ఉందని చెబుతున్నారు.

హెన్రీకి 40 రోజుల వయసు ఉన్నప్పటి నుంచే అది తన దగ్గర ఉందని, దాన్ని తానే కొనుగోలు చేశానని దేహద్రాయ్ చెబుతున్నారు. కాబట్టి అసలైన సంరక్షకుడిని తానేనని దేహద్రాయ్ అన్నారు.