Centre refuses railway concession for senior citizens, cites recurring losses
Indian Railway: రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. ఖర్చులు తడిసిమోపెడవుతున్నందు వల్ల ఇప్పటికిప్పుడు రాయితీలు పునరుద్ధరించలేమని బుధవారం లోక్సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ల రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు సమాధానం ఇచ్చారు. గతంలో సీనియర్ సిటిజన్లకు రైళ్లలో 40 నుంచి 50 శాతం వరకు టికెట్ రాయితీ ఉండేది. కరోనా సమయం నుంచి దాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
ఇక ఈ విషయమై రైల్వే మంత్రి మాట్లాడుతూ ”గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం 59 వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చాము. ఇది పలు రాష్ట్రాల బట్జెట్ కంటే కూడా ఎక్కువ. పెన్షన్లు, వేతన బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి” అని అన్నారు. రైల్వేల వార్షిక పెన్షన్ బిల్లు 60,000 కోట్ల రూపాయలు ఉందని, వేతన బిల్లులు 97,000 కోట్ల రూపాయలు, ఇంధనం కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆయన చెప్పారు. ఒకవేళ ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు రాయితీ అంశాన్ని పరిశీలిస్తామని, ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ రైల్వేల స్థితిగతులను చూడాలని మంత్రి కోరారు.