పోలీసు అని నమ్మించడమే కాదు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌ను అంటూ హైడ్రామా ప్లే చేసిన వ్యక్తి ఏడుగురిని పెళ్లాడడంతో పాటు ఆరుగురు మహిళల్ని రెండేళ్లుగా మోసం చేస్తున్నాడు. నిజం తెలుసుకున్న చెన్నై పోలీసులు తిరుపూర్‌లో ఉంటున్న రాజేశ్ పృథ్వీ(42) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇతనిపై త్రిచి, కొయంబత్తూరు, తిరుపతి, తిరుపూర్, కాళహస్తిల్లో మరిన్ని అక్రమ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2017లో నెల్సన్ మాణిక్యం రోడ్‌లో కాల్ సెంటర్ ఓపెన్ చేసి అందులో మహిళలకు ఉద్యోగాలు కల్పించేవాడు. వారికి పోలీస్ గెటప్‌లో ఉన్న ఫొటోలు చూపించి.. ఎన్ కౌంటర్లు చేసి తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పేవాడట.
జూన్ 30న ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో 18ఏళ్ల వయస్సున్న మహిళ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాజేశ్‌కు చెందిన కాల్ సెంటర్ లోనే యువతి పనిచేస్తుంది. ప్రాథమిక విచారణలోనే పోలీసులకు రాజేశ్ కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. సెప్టెంబర్ 9న యువతిని పట్టుకోగలిగారు. పోలీసులకు షాక్ ఇస్తూ రాజేశ్ తనను పెళ్లి చేసుకున్నాడని ఆ మహిళ చెప్పింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు యువతిని కొట్టి తనను వదిలేయాలని చెప్పాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ బయటికొచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..
రాజేశ్.. ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో టెలి మార్కెటింగ్ చేయించేవాడు. రూ.30లక్షలు చెల్లిస్తే మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ వారంతా ఫోన్లు చేసేవారు. 22మంది మహిళలను ఉద్యోగినులుగా జాయిన్ చేసుకున్నాడు. వాళ్లలోనే ఏడుగురిని పెళ్లి చేసుకుని ఆరుగురిని లైంగికంగా వేధించాడు.
ఫేక్ బిజినెస్‌లో వచ్చిన డబ్బులు మహిళలను పెళ్లి చేసుకోవడానికి వినియోగించేవాడు. ఈ క్రమంలో ఒరిజినల్ పేరు దినేశ్‌కు బదులుగా రాజేశ్ పృథ్వీ అనే పేరుతో ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ఓటర్ కార్డు, ఫేక్ పాన్ కార్డు, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్‌లను తయారుచేయించుకున్నాడు.
ఈ నేరాల చరిత్రలో నెల్లూరులో ఒకసారి అరెస్టు అయిన రాజేశ్.. కొయంబత్తూరులోని స్టేషన్లో అదుపులో ఉండగా పారిపోయాడు. బెయిల్ మీద బయటికొచ్చి పలు చోట్ల కాలం గడిపేవాడు. అంతకుముందు వేరే బిజినెస్ పెట్టి అక్కడకూడా మహిళలను వేధించేవాడు. రాజేశ్ పృథ్వీ అనే పేరు మాత్రమే కాకుండా శ్రీ రామ్ గురు దీనా, దయాలన్, దీన దయాళన్, రెజేశ్ పెరుమాళ్ అనే పేర్లతోనూ చలామణి అయ్యేవాడు.
అతని దగ్గరి నుంచి ఫేక్ ఐడెంటిటీ కార్డు, హ్యాండ్ కఫ్ జత, పాన్, ఆధార్ కార్డ్ లను రికవరీ చేశారు. రాబోయే రోజుల్లో అతనిపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.