‘‘నక్సల్‌ అంకుల్‌ మా నాన్నను వదిలిపెట్టరా ప్లీజ్’’ మిస్ అయిన జవాన్  5 ఏళ్ల కుమార్తె  విన్నపం

Missing Crpf Jawan's Daughter Emotional Appeal

Missing CRPF Jawan’s Daughter Emotional Appeal : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, జవాన్ల మధ్య జరిగిన భీకర పోరులో 22 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ పోరులో మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే పోరులో ఓ జవాను మిస్ అయ్యాడు. ఆ జవాను పేరు రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌. మిస్ అయిన రాకేశ్వర్ కోసం రాకేశ్వర్ ఇప్పటికీ మావోయిస్టుల అదుపులోనే ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో రాకేశ్వర్ సింగ్ మిస్ అవ్వటంతో అతని కుటుంబం అల్లాడిపోతోంది. మావోల చేతికి చిక్కాడా? ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారోనని కుమిలిపోతోంది. తీవ్ర భయాందోళనకు గురవుతోంది. కంటిమీద కునుకు లేకుండా రాకేశ్వర్ క్షేమంగా తిరిగి రావాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటోంది.

మిస్ అయిన జవాను రాకేశ్వర్‌ సింగ్‌ క్షేమంగా తిరిగి రావాలని యావత్తు భారతదేశం కోరుకుంటోంది. ఈ క్రమంలో రాకేశ్వర్ కూతురు రాఘవి తన తండ్రి కోసం పరితపిస్తోంది. చిన్నారి రాఘవి తన తండ్రిని విడిచిపెట్టాలని నక్సలైట్లకు కోరుతూ చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేస్తోంది. కంటతడి పెట్టిస్తోంది. రాకేశ్వర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన మీడియా మిత్రుల ద్వారా రాఘవి తన తండ్రిని వదిలిపెట్టాలంటూ నక్సలైట్లను విజ్ఞప్తి చేస్తూ..ఇలా వేడుకుంటోంది..

‘‘నేను పప్పా(నాన్న)ను చాలా మిస్‌ అవుతున్నాను. నాకు పప్పా అంటే ఎంతో ఇష్టం. ప్లీజ్‌ నక్సల్ అంకుల్‌.. మా పప్పాను వదిలేయరా..మా ఇంటికి క్షేమంగా పంపించండీ ప్లీజ్ నక్సల్స్ అంకుల్’’ అంటూ చిన్నారి రాఘవి చేసిన విజ్ఞప్తి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాఘవితో పాటు రాకేశ్వర్‌ ఏడు సంవత్సరాల వయస్సున్న మేనల్లుడు కూడా మా మామను క్షేమంగా పంపించండీ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నాడు. ‘‘మా మామయ్య ఎక్కున్నారో మీకు తెలిసే ఉంటుంది కదా..దయచేసి మా మామను క్షేమంగా పంపించమని నక్సల్స్ అంకుల్స్ కు మీరు చెప్పరా ’’ అంటూ మీడియా వారిని అడుగటం గుండెల్ని కలసివేస్తోంది.

ఇక జవాను రాకేశ్వర్‌ భార్య మీనూ సంగతి అయితే చెప్పనక్కరలేదు. ఆమె బాధ..వేదన వర్ణనాతీతంగా ఉంది.. భర్త క్షేమంగా తిరిగి రావాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటోంది. ఒళ్లంతా కళ్లు చేసుకుని భర్త కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కొన్ని రోజుల క్రితం ఫోనులో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ..నేను నా భర్తతో ‘‘ఐదు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడాను. ఓ ఆపరేషన్ కోసం వెళుతున్నానని చెప్పారనీ..అప్పటి వరకూ మళ్లీ ఫోన్ చేయటం కుదరకపోవచ్చు..తిరిగి వచ్చిన వెంటనే ఫోన్‌ చేస్తానని చెప్పారని కన్నీటితో తెలిపారు. మీడియాలో దాడికి సంబంధించిన వార్తలు వినగానే భయంతో వణికిపోయాను. ఆయన ఎలా ఉన్నారోనని ఆదుర్దాతో ఫోన్ చేశాను..కానీ, అక్కడి నుంచి ఎలాంటి సమాధానం లేదు’’ అంటూ మీనూ కన్నీటితో తెలిపారు.

ఆ తరువాత బీజాపూర్‌లోని ఓ స్థానిక రిపోర్టర్‌ ఫోన్‌ చేసి తన భర్త మావోయిస్టుల అదుపులో ఉన్నట్లు చెప్పారనీ..అప్పటినుంచి ఆయన ప్రాణాలతోనే ఉన్నారనీ సంతోష పడాలో..మావోల అదుపులో ఉన్నారని తెలిసి ప్రతీ క్షణం హడలిపోతున్నానని మీనూ తెలిపారు. ఆయన్ని విడుదల చేయాలంటూ ఓ ఆడియో రికార్డ్‌ చేసి పంపాలని రిపోర్టర్‌ సూచించినట్లు తెలిపారు. కానీ రిపోర్డర్ అని చెప్పి తన భర్త మావోల అదుపులో ఉన్నాడని చెప్పిన వ్యక్తికి అదీకూడా బీజాపూర్‌లో ఉన్న ఓ వ్యక్తికి తన ఫోన్‌ నెంబర్‌ ఎలా లభ్యమైందని మీనూ ఈ సందర్భంగా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని మీనీ కోరారు.

కాగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ పోరు గురించి కేంద్రం సీరియస్ గా తీసుకుంది. మావోలను అంతం చేస్తామని వారి అంతం తప్పదని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో హోంమంత్రి అమిత్‌ షా.. తన భర్త సురక్షితంగా తిరిగొచ్చేలా ఏర్పాట్లు చేస్తారని మీనీ ఆశాభావం వ్యక్తం చేశారు. వారు అన్నమాట నిలబెట్టుకుని తన భర్తను క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.