తమిళ రాజకీయాల్లో హీరో రజినీకాంత్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారంటూ రజనీ సంచలన కామెంట్స్ చేశారు.
తమిళ రాజకీయాల్లో హీరో రజినీకాంత్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తమిళనాడు ప్రజలు అద్భుతాన్ని చూపించబోతున్నారంటూ రజినీకాంత్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఒక్క డైలాగ్ తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. ఆ అద్భుతం ఏంటో చెప్పనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో జరుగబోయే అనూహ్య మార్పులేనని ప్రచారం జరుగుతోంది.
ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమం ముగిసిన తర్వాత రజినీకాంత్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమిళనాడు ప్రజలు తప్పకుండా ఓ అద్భుతాన్ని చవిచూస్తారని.. దానికి తనది గ్యారంటీ అన్నారు. కమల్ హాసన్ తో పొత్తు ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని చెప్పారు. సీఎం ఎవరనేది ఎన్నికల ఫలితాల తరువాతే నిర్ణయిస్తామన్నారు.
ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు ఎలాంటి అద్భుతాన్ని చూస్తారనేది తాను ఇప్పుడే చెప్పనని రజినీకాంత్ అన్నారు. ముందే వెల్లడిస్తే.. అది అద్భుతం ఎలా అవుతుందని తనదైన స్టైల్ లో చెప్పారు తలైవా. 2021లో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ తో తాను కలిసి పని చేస్తానని రజినీకాంత్ ప్రకటించారు.
రజినీ తన పార్టీతో కలిసి వస్తే బాగుంటుందని కమల్ హాసన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడులో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటాలని కమల్ హాసన్ భావిస్తున్నారు.