CJI and Modi: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుసగా పదవసారి జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. అయితే మోదీ మాట్లాడుతుండగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్.. ఒక్కసారిగా మోదీకి చేతులు జోడించి నమస్కరించారు. దీనికి కారణం లేకపోలేదు. దానికి ముందు సుప్రంకోర్టు మీద మోదీ ప్రశంసలు కురిపించారు. సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని పది భాషల్లోకి తర్జుమా చేస్తుండడంపై మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సందర్భంలోనే మోదీకి సీజేఐ నమస్కరించారు.
ఈ సంవత్సరం రిపబ్లిక్ డే, దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తూ.. సుప్రీంకోర్టు జనవరి 26న పది భాషల్లో వెయ్యికి పైగా నిర్ణయాల అనువాదాలను జారీ చేయడం ద్వారా ప్రారంభించింది. హిందీతో పాటు ఒడియా, గుజరాతీ, తమిళం, అస్సామీ, ఖాసీ, గారో, పంజాబీ, నేపాలీ, బంగ్లా భాషల్లో కూడా తీర్పులను తర్జుమా చేస్తున్నారు. తర్వాత దాని పరిధిని మరిన్ని భాషలకు విస్తరించనున్నారు. న్యాయం కోసం క్యూలో నిలబడిన దేశంలోని ఆఖరి పౌరుడు కూడా కోర్టును, దాని నిర్ణయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చేస్తున్న ప్రచారం దీంతో మరింత ఊపందుకోనుంది.
కొత్త ప్రచారం ప్రకారం, సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో హిందీతో సహా ప్రాంతీయ భాషలలో నిర్ణయాల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోంది. గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మంచి ఫలితాలనే ఇస్తోంది. సుప్రీంకోర్టు ఇ-కోర్టుల కమిటీ ప్రకారం, అనువాదం కోసం ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారు. కానీ నిర్ణయాల సరైన అనువాదం కోసం, న్యాయ అధికారుల సహాయం కూడా తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ వారిని పర్యవేక్షిస్తున్నారు. గతంలో కూడా ప్రధాని మోదీ స్వయంగా ఈ చర్యపై సుప్రీంకోర్టును ప్రశంసించారు.