బాంబులేస్తేనే భయపడలేదు.. మోడీకి భయపడతానా?

  • Publish Date - March 2, 2019 / 04:04 AM IST

“ప్రధాని మోడీ రాష్ట్రానికి ఏమీ చేయరని, నన్ను తిట్టడానికే రాష్ట్రానికి వస్తారని, ఒకవేళ నేను కనిపిస్తే కొడతారేమో!” అంటూ ప్రధాని మోడీ పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారు. విశాఖ సభలో ప్రధాని మోడీ తనపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ మాట్లాడిన చంద్రబాబు.. కుటుంబ పాలన అని మోడీ తనని విమర్శింస్తున్నారని, ఆయనకు కుటుంబం ఉంటే కుటుంబ విలువ తెలిసేది కదా? అంటూ విమర్శించారు. మనం రోబోలం కాదు. మానవులం. భారతదేశం ఔన్నత్యం కుటుంబ వ్యవస్థలో ఉంది. ఎవరి వారసులైనా సామర్థ్యం ఉంటేనే రాణిస్తారు. మోదీ నన్ను బెదిరించాలని చూస్తే కుదరదు. ఐటీ, ఈడీ, సీబీఐలను చూపిస్తే బయపడే రకం నేను కాదు అని అన్నారు. తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలేదని అన్నారు. “నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలతో ఉన్న నేను మోడీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. పదే పదే కూటమిని విమర్శిస్తున్న మోడీ ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందని అన్నారు.

విశాఖను రాష్ట్ర యువకుల కలల నగరంగా మోదీ అభివర్ణించారని, జోన్‌ ఇస్తున్నామంటూ.. వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేసి, 7000 కోట్ల ఆదాయం రాయగఢ డివిజన్‌కు ఇచ్చారంటూ విమర్శించారు. మా జోన్‌కు డబ్బుల్లేకుండా మాయా జోన్‌ ఇచ్చి మోడీ మాయాజాలం చేశారంటూ విమర్శాంచారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ గొప్పగా చెప్పిన మోడీ.. హుద్ హూద్ సహాయంగా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి 640 కోట్లతో సరిపెట్టారని విమర్శించారు. తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు కూడా మోడీ రాలేదన్నారు. ఇదేనా ఉత్తరాంధ్ర పట్ల మీ అభిమానం అంటూ ద్వజమెత్తారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలకు 24వేల కోట్లు ఇవ్వాలి. కానీ ఏడు జిల్లాలకు ఆరేళ్లపాటు రూ.350 కోట్ల చొప్పున ఇస్తున్నారు. హక్కుల కోసం నిలదీయడం మొదలు పెట్టేసరికి ఆ నిధులు కూడా ఇవ్వట్లేదు. రూ.350కోట్లు ఖాతాలో వేసి మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. 

బలహీన ప్రభుత్వంతో దేశం బలహీనపడుతుందంటూ మోడీ అంటున్నారని, బలమైన ప్రధానిగా మోడీని చేసినా దేశంకు ఏం ఒరిగింది? అని చంద్రబాబు విమర్శించారు. పూర్తి మెజార్టీలేని ప్రభుత్వం నడిపిన పీవీ నరసింహారావు దేశాన్ని సంస్కరణల దిశగా నడిపించారని గుర్తు చేశారు. ప్రధాని బలంగా ఉండడం కాదు. ప్రధాని తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా, బలంగా లబ్ధి చేకూరేలా ఉండాలని అన్నారు. ప్రధాని మోడీ చెప్పినవి ఏమీ చేయలేదని, మోడీవి నినాదాలు. మాది ఆచరణ అని అన్నారు. పీవీ వేసిన ఆర్థిక పునాదులు నోట్లరద్దు నిర్ణయంతో కదిలిందని ఆయన అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారని, ఏం చేయకుంటే కేంద్రమే 700 అవార్డులు ఎలా ఇచ్చిందంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మీకు ధైర్యం ఉంటే అవార్డులు తప్పు అని ప్రకటించాలని అన్నారు.